NTV Telugu Site icon

Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!

Locked Self

Locked Self

Locked Self: కొవిడ్‌-19 బారిన పడుతారనే భయంతో ఓ మహిళ, తన మైనర్ కొడుకుతో కలిసి గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్‌లోని వారి ఇంట్లో మూడేళ్లపాటు గృహనిర్బంధంలోనే ఉండిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహిళ భర్త సుజన్ మాఝీ చక్కర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోపోలీసులను ఆశ్రయించడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదీ కూడా అద్దె ఇంట్లోనే అలా నిర్బంధంలో ఉండిపోయారు. అతని అభ్యర్థన మేరకు, పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ సభ్యుల బృందం మంగళవారం నివాసానికి చేరుకుని ప్రధాన తలుపు పగులగొట్టి మున్మున్ మాఝీ, ఆమె 10 ఏళ్ల కొడుకును రక్షించారు. కొవిడ్‌ మహామ్మారి వచ్చినప్పటి నుంచి అంటే సరిగ్గా 2020 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. కనీసం ఆ మహిళ కొడుకు సూర్యుడు ఉదయించడాన్ని కూడా చూడకుండా అలానే ఇంట్లో ఉండిపోయాడు.

ప్రస్తుతం వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకురాగా.. ఇంట్లో బట్టలు, వెంట్రుకలు, చెత్త, ధూళి, కిరాణా సామాను కుప్పగా కనిపించాయి. బాలుడి తల్లి ఇంట్లోనే చిన్నారి జుట్టును కత్తిరించేదని తెలిసింది. ఇదిలా ఉండగా ఇంట్లో గ్యాస్ స్టవ్‌కు బదులు ఇండక్షన్ ద్వారా వంట చేశారు. 3 సంవత్సరాలుగా ఇంటి చెత్తను కూడా బయటకు తీయలేదు. ఈ మూడేళ్లలో ఎవరూ ఇంటికి వెళ్ళలేదు. పిల్లవాడు ఇంటి గోడలకు పెయింటింగ్స్ వేసేవాడు. పెన్సిల్‌తో మాత్రమే చదువుకునేవాడు. గత మూడేళ్లుగా ఆ మహిళ కుమారుడు సూర్యుడిని కూడా చూడకపోవడం ఆశ్చర్యకరం. ఇంతలో, వారిద్దరూ ఇంట్లో నిర్బంధంలో ఉన్నట్లు ఇరుగుపొరుగు వారికి ఎటువంటి ఆధారం లేదు. కొవిడ్ -19 కారణంగా మహిళ తీవ్ర భయాందోళనలకు గురైందని, తన కొడుకు ఇంటి నుండి బయటకు వస్తే చనిపోతాడని ఆమె నమ్ముతుందని పోలీసు అధికారి తెలిపారు.

Read Also: Pakistan: తప్పుదోవ పట్టిస్తున్న పాకిస్థాన్.. హిజ్బుల్‌ కమాండర్‌ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్ ప్రత్యక్షం

కుమారుడితో నిర్బంధంలో ఉన్న మూడేళ్లలో, మహిళ తన భర్తను కూడా ఇంట్లోకి అనుమతించలేదు. మొదటి లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయబడిన తర్వాత 2020లో అతను ఆఫీసు కోసం ఇంటి నుండి బయటకు వచ్చాడు. అప్పటి నుండి ఇంట్లోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు.సుజన్‌ మాఝీ తన కుటుంబంతో కనెక్ట్ అయ్యే ఏకైక మార్గం వీడియో కాల్స్ ద్వారా మాత్రమే. నెలనెలా ఇంటి అద్దె చెల్లించి, కరెంటు బిల్లులు కట్టి, కొడుకు స్కూల్ ఫీజు కట్టి, కిరాణా, కూరగాయలు కొనుక్కొని, రేషన్ బస్తాలను కూడా మెయిన్ డోర్ బయటే పెట్టేవాడు. సుజన్‌ మాఝీ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. ఐతే మున్మున్‌ మాత్రం లాక్‌డౌన్‌ ఎత్తేసి మాములుగా అయిపోయినా ఇంకా అలా స్వయం నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చచెప్పిన వినక పోయే సరికి చక్కర్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటు తీసుకువచ్చారు. రక్షించిన తర్వాత, తల్లీకొడుకులను సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె భర్త సుజన్‌ తన భార్య కొడుకుని బయటకు తీసుకొచ్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.