ప్రస్తుతం ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్లినా..సెల్ఫీలు, ఫొటోలు తప్పనిసరిగా దిగుతాం. కానీ ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో తాజాగా చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రముఖ పర్యటక ప్రాంతానికి వెళ్లింది. అక్కడ సెల్ఫీ దిగుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాలు జారి లోయలో పడింది. అసలేం జరిగిందంటే… మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశం బోరాన్ ఘాట్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలోకి జారి పడింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యటకులు భారీగా తరలి వస్తున్నారు.
READ MORE: Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక భూదందా.. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర
అలాగే పూణెకు చెందిన కొంత మంది బోరాన్ ఘాట్ సందర్శనకు వచ్చారు. వారిలో నస్రీన్ అమీర్ ఖురేషీ అనే మహిళ అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డు, స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను రక్షించారు. తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఆమెకు గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోని పర్యటక ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసివేయాలని కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశించారు.