NTV Telugu Site icon

Rice Farming: సఫలమైన సరికొత్త వరి వంగడం.. ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు

Perennial Rice Variety

Perennial Rice Variety

Rice Farming: దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పెట్టుబడులు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు కూలీల కొరత, కూలీ రేట్లు ఏటా పెంపు, ఇతర ఖర్చులతో తల్లడిల్లిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను అధిగమించే దిశగా చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా నాలుగేళ్ల పాటు, 8సీజన్లు పంట కోతకోస్తే ఎలా ఉంటుంది. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ దీనిని చైనా శాస్త్రవేత్తలు చేతల్లో చేసి నిరూపించారు. నిజమేనండి.. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా 8 సీజన్ల పాటు కోత కోసే విధంగా సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. అంటే ఒక్కసారి నాటు వేస్తే చాలు.. 8సార్లు పంట చేతికి వస్తుందన్నమాట. కోత కోసిన తర్వాత నీరు పెడితే చాలు.. అవే పిలకలపై మరోసారి పైరు పెరుగుతుంది. ఈ కొత్త వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు సాగులోకి తెచ్చారు. ‘పీఆర్‌23’ పేరుతో పిలుస్తున్న ఈ వంగడాన్ని ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో చైనా రైతులు సాగుచేశారు. ఎకరానికి సగటున 27 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది.

సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ కొత్త వంగడంతో 60 సాగునీటిని, 58శాతం కూలీల ఖర్చును ఆదా చేయొచ్చని పరిశోధకులు వెల్లడించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చేసే ఖర్చులో 49 శాతం వరకూ కలిసొస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. 2018లో అక్కడి రైతుల సాగుకు పీఆర్‌23 వంగడాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మరింతగా సాగుచేసి ప్రయోగాలు చేయాల్సి ఉంది. చైనా వృద్ధి చేసి ఆ వంగడాలు మనదేశంలో సాగు చేసేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించి చెప్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థలను అడిగింది. రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ కూడా చైనా వంగడం సాగు విధానాలపై అధ్యయనం చేస్తోంది.

Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!

సాధ్యాసాధ్యాల గురించి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ వివరించారు. మనదేశం సమశీతోష్ణ మండలంలో ఉందని.. ప్రతి 4నెలలకు ఒకసారి సీజన్‌ పూర్తిగా మారుతుందన్నారు. ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా ఉండడంతో పాటు తెగుళ్లు చుట్టుముడుతున్నాయన్నారు. చైనా ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణం మనదేశానికి భిన్నంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మన వాతావరణం, ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని కొత్త వంగడాల సాగుకు అనుమతి ఇవ్వాలన్నారు.