Karimnagar Tragedy: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహంతో ఓ తండ్రి అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే గాజుల సంపత్ అనే వ్యక్తి కూతురు 2023 ఫిబ్రవరి 16వ తేదీన అదే సామాజిక వర్గానికి చెందిన రత్నాకర్ అనే యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరువురి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో రోజు రోజుకి వీరి మధ్య దూరం పెరిగిపోతుంది. దీంతో పెళ్లి సంఘటనను మనసులో పెట్టుకొని తనకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుందనే అక్కసుతో కూతుర్ని చేసుకున్న యువకుని ఇంటికి వెళ్లే దారికి అడ్డుగా నిలువెత్తు సిమెంటు ఇటుకలను గోడగా పెట్టడమే కాకుండా అడ్డుగా ఓ ట్రాక్టర్ ను కూడా నిలిపి ఉంచాడు.
Read Also: IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
దీంతో రత్నాకర్ కు తన ఇంటికి వెళ్లే దారి లేకుండా పోయింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తనపై కక్ష సాధించే క్రమంలో ఇలాంటి చర్యలకు గాజుల సంపత్ దిగుతున్నాడని అతడు ఆరోపించాడు. అమ్మాయి తండ్రి సంపత్ నా భూమిలో నేను గోడ కట్టుకున్నాను అని మా మధ్య భూ వివాదం ఉంది అని వివాదం పరిష్కారం అయ్యే వరకు దారి మూసే ఉంటుంది అని చెప్పాడని రత్నాకర్ తెలిపాడు. వెంటనే ఈ ఘటనపై పోలీసులు కల్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు రత్నాకర్ వేడుకున్నారు.
