NTV Telugu Site icon

No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..

No Confidence

No Confidence

No-Confidence Motions: భారత మొదటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఒక్క చౌదరి చరణ్‌సింగ్‌కు మాత్రమే మినహాయింపు. 1962 చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌ ఓడిపోవడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై ఆచార కృపలానీ 1963లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలి తీర్మానం వీగిపోయింది. కాకపోతే నాలుగు రోజులపాటు 21 గంటలు చర్చ జరిగింది. ఆ తర్వాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి మూడుసార్లు, ఆపై ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. పీవీ నరసింహారావు సైతం మూడుసార్లు ఈ గండం గట్టెక్కారు.

మొరార్జీ దేశాయ్‌, రాజీవ్‌గాంధీ, వీపీసింగ్‌, చంద్రశేఖర్‌, ఐకే గుజ్రాల్‌, దేవగౌడ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ. ఇలా నెహ్రూతో మొదలుకొని మోడీ వరకు 27సార్లు అవిశ్వాస తీర్మానాల రుచి చూశారు. రెండుసార్లు మాత్రమే నో కాన్ఫినెడ్స్‌ మోషన్స్‌కు కేంద్ర ప్రభుత్వాలు పడిపోయాయి. 1979లో మొరార్జీ దేశాయ్‌.. 1999లో అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు కుప్పకూలాయి. వీటిల్లో వాజపేయి ప్రభుత్వమైతే ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. తీర్మానాల విషయంలో రెండు కీలక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానమైతే.. అధికారపార్టీయే సభా విశ్వాసం కోరుతూ పెట్టే తీర్మానం రెండోది. తీర్మానం ఏదైనా.. లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరగడం ఖాయం. సభలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీల సంఖ్యాబలం ఆధారంగా టైమ్‌ కేటాయిస్తారు సభాపతి. ఆ టైమ్‌లోనే ఆ పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడతారో ఫిక్స్‌ చేసుకోవాలి.

అధికారపార్టీకి సభలో ఫుల్‌ మెజారిటీ ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకున్నా.. కొన్ని కీలక అంశాలపై చర్చ జరగాలని భావించినా.. విపక్షపార్టీలు అరుదుగా అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు నోటీసు ఇస్తాయి. అయితే ఇలా ఇచ్చే నోటీసుకు 50 మంది ఎంపీల మద్దతు అవసరం. అది ఉదయం పదికల్లా స్పీకర్‌ ఛాంబర్‌కు నోటీసు అందజేయాలి. అప్పుడే ఆ నోటీసును సభలో ప్రస్తావించి.. ఎంత మంది మద్దతిస్తున్నారో ఎంపీలు లేచి నిలబడాలని స్పీకర్‌ కోరతారు. 50 మంది నిల్చుంటే తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పి.. ఎప్పటి నుంచి చర్చ చేపడతారో వెల్లడిస్తారు. ఆ విధంగా విపక్ష పార్టీ నుంచి చర్చ మొదలై చివరకు ప్రధాని సమాధానంతో చర్చ ముగుస్తుంది. చర్చ తర్వాత ముజువాణి ఓటు లేదా రహస్య ఓటింగ్‌ ద్వారా తీర్మానానికి ఎంత మంది మద్దతిస్తున్నారో లెక్కిస్తారు. ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో సగానికిపైగా MPలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. లేదంటే వీగిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదో కీలక ఘట్టం. విపక్ష కూటమి ఇండియాగా ఏర్పడిన తర్వాత ఇచ్చిన తాజా అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం లోక్‌సభలో సంఖ్యాపరంగా ఎన్డీయే కూటమి బలంగా ఉంది. కాకపోతే లోకసభ ఎన్నికలకు 8 నెలల ముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతోపాటు.. మణిపూర్‌ హింస బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పరిణామం కావడంతో వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రెండు పక్షాలు మాటల దాడికి దిగుతాయనే అంచనాలు ఉన్నాయి.

Show comments