Site icon NTV Telugu

Bangladesh Agitations: బంగ్లా ప్రధానిపై తీవ్ర అసహనం.. రాజీనామా చేయాలంటూ వీధుల్లోకి వచ్చిన జనం

Bangladesh

Bangladesh

Bangladesh Agitations: బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనా పై ప్రజలనుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఢాకా ఆందోళనకారులతో నిండిపోయింది. ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆందోళనల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) నేతలు పాల్గొన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరుపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవలికాలంలో నిరసనలు మరింత తీవ్రంగా మారాయి. శుక్రవారం నాడు భద్రతా దళాలు బీఎన్‌పీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లాయి. భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందారు. దీంతో విపక్షాల్లో ఆగ్రహం పెల్లుబికింది.

Read Also: Indian Racing league: ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్.. విజేతగా కొచ్చి

ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ప్రజాందోళనలు చేపట్టారు. శనివారం చేపట్టిన ఆందోళనల్లో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నట్లు బీఎన్‌పీ నేతలు చెప్తున్నారు. ఢాకాలోని గోలప్‌బాగ్ మైదాన్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ర్యాలీలో ప్రజలు ‘షేక్ హసీనా ఓట్‌ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 20వేల మంది పోలీసులు మోహరించారు. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు 2024 జనవరిలో జరుగనున్నాయి. 2023 డిసెంబర్లో జరిగే బంగ్లా పార్లమెంటు ఎన్నికలకు ముందే హసీనా రాజీనామా చేసి ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. షేక్‌ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్‌ ప్రధానిగా వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు.

Exit mobile version