NTV Telugu Site icon

Road Accident: నోయిడాలో కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ వృద్ధుడు

Accident

Accident

కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా మార్కెట్‌ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు కొడుకు ప్రదీప్ తన తండ్రి జనక్ దేవ్ ఆదివారం ఉదయం 5.30 గంటలకు వాకింగ్‌కు వెళ్లాడని.. అతను తరచూ వాకింగ్ చేసిన అనంతరం పాలు తీసుకుని వచ్చేవాడని తెలిపాడు. అయితే ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ప్రదీప్‌ వెతకడం ప్రారంభించాడు. ఇంతలో కంచన్‌జంగా మార్కెట్‌లో రోడ్డు పక్కన తన తండ్రి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని ప్రదీప్ చూశాడు. గుర్తుతెలియని వాహనం డ్రైవర్‌ జనక్‌ దేవ్‌ను ఢీకొట్టి పారిపోయాడని స్థానికులు ఫిర్యాదుదారుడికి తెలిపారు.

Mahesh : కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ వైరల్…

మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు డీసీపీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడు కాలినడకన వెళ్తున్నట్లు కనిపించాడు. కొంత సేపటికి వృద్ధుడి వైపు అతివేగంతో ఓ కారు వస్తూ ఉన్నట్లు కనిపించింది. కొద్దిసేపటికే కారు తన ఎదురుగా వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టినట్లు వీడియోలో ఉంది.

Needle Stuck In Hip: మహిళ తుంటిలో సూది.. 3 ఏళ్ల తర్వాత తొలగించిన డాక్టర్లు..

ఢీకొట్టిన తర్వాత వృద్ధుడు చాలా సేపు గాలిలో ఉండి ఆ తర్వాత నేలపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలం చుట్టూ ఉన్న దుకాణాలు, ఇళ్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డైంది. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత నిందితుడు వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నంబర్‌ ఆధారంగా పరారీలో ఉన్న డ్రైవర్‌ను గుర్తిస్తున్నారు.