Sumitra Pampana : హైదరాబాదులో దొంగలు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచింగ్స్, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి ఉన్నదంతా దోచుకెళ్తున్నారు. తాజాగా ఓ టీవీ నటి ఇంట్లో దొంగలు పడి భారీగా బంగారం, డబ్బు దోచుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. శ్రీనగర్ కాలనీలోని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ సుమిత్రా పంపన ఇంట్లో దొంగలు పడ్డారు. నటి సుమిత్రా వ్యక్తిగత పనిపై ఈనెల 18న ఢిల్లీకి వెళ్లారు. ఇంటికి తాళం వేసి అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తనకోడలికి తాళాలు అప్పగించి ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఆమె లేనిది చూసి ఫ్లాట్‌లో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వజ్రాభరణాలను అపహరించారు.
Read Also: Viral : పెళ్లిలోనే ఇలా కొట్టుకుంటే జీవితాంతం వీళ్లేం కలిసుంటారు
అదే రోజు ఆమె కోడలు ఫ్లాటుకు వెళ్లి చూడగా.. ప్రధాన ద్వారం పగులగొట్టి ఉండటాన్ని ఆమె గుర్తించారు. ఆమె వెంటనే సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్‌కు దొంగతనం విషయం తెలియజేశారు. అక్కడికి చేరుకున్న విజయ్ ఇంటిని పరిశీలించి తన అక్క సుమిత్రాకు ఫోనులో విషయం చెప్పాడు. బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సుమిత్ర ఇంటికి వెళ్లి చూడగా.. బంగారం, వజ్రాభరణాలతో పాటు అల్మీరా లాకర్‌లో ఉంచిన మేనల్లుడు బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also:Protest : కూతురి శవంతో 30గంటల పాటు ఆమె ప్రియుడి ఇంటి ముందు తల్లి ధర్నా