Site icon NTV Telugu

Uttar Pradesh: బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు..

Up Fire

Up Fire

ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే.. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో స్కార్పియో కారులో వస్తుండగా, బోదాపూర్‌ గ్రామం నుంచి బయలుదేరి గ్రామ మలుపు వద్దకు చేరుకోగానే.. పెళ్లి కార్డు ఇస్తామంటూ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఆగంతకులు కారును ఆపారని తెలిపారు. మంత్రి కారు కిటికీ తెరువగానే ఓ దుండగుడు పిస్టల్‌ తీసి నాలుగుసార్లు కాల్చాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు పేర్కొ్న్నారు. కాగా.. గాయపడిన మంత్రి ప్రమోద్‌ను గ్రామస్థులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కాగా.. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఈ హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే జౌన్‌పూర్ లోక్‌సభ అభ్యర్థి కృపా శంకర్ సింగ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పుష్పరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.

Exit mobile version