2000Year Old Candle : ఇజ్రాయెల్‌లో రెండు వేల ఏండ్ల కిందటి మట్టి క్యాండిల్ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గలీలీ సమీపంలోని కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. ముగ్గురు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌కు సమీపంలో దీనిని కనుగొన్నారు. తొలుగ నేలకు అతుక్కొని ఉన్న క్యాండిల్‌ను చూసి వారు ఏదో ప్రత్యేకమైన రాయిగా భావించారు. కొవ్వొత్తి పురాతనమైనదిగా గుర్తించిన వెంటనే వారు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాన్ని తల్లిదండ్రుల సాయంతో ఇజ్రాయెల్ పురావస్తు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. వారు పరీక్షించి అది 2000 ఏండ్ల నాటి అరుదైన మట్టి క్యాండిల్ అని తేల్చారు. విద్యార్థులను పురావస్తు అధికారులు అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ రంగంలోకి దిగింది. యాంటిక్విటీస్ అథారిటీ ఇప్పటికే త్రవ్వకాలు జరుపుతున్న ప్రదేశానికి సమీపంలో యాదృచ్ఛికంగా కొవ్వొత్తి కనిపించిందని, ఇది కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటు అందిస్తోందని వారు భావిస్తున్నారు. అంతేకాకుండా లభించిన కొవ్వొత్తి పురాతన సైట్ ఎంతవరకు ఉందన్న దానిపై క్లూ దొరికేందుకు సాయపడుతుందని. అథారిటీలోని టిబెరియాస్, లోయర్ గెలీలీకి చెందిన ఆర్కియాలజిస్ట్ డాక్టర్ హైమ్ మమాలియా వివరించారు.