Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి

Minor Girl Harassment

Minor Girl Harassment

Minor Girl Harassment: హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల మైనర్ బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనపై అందిన సమాచారం ప్రకారం.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో F బ్లాక్‌లో నిందితుడు హాజిజ్ అబ్దుల్, బాధిత బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. హాజిజ్ అబ్దుల్ నీలోఫర్ ఆస్పత్రి వద్ద టీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతుండగా.. ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

నిందితుడు బాలికకు ముద్దు పెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. ఈ దృశ్యాలను చూసిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నిందితుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హాజిజ్ అబ్దుల్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.