8th CPC Approval: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ వేతన సంఘం అమలు కోసం ఇప్పటికే కేబినెట్ ఛైర్‌పర్సన్‌ను ఎంపిక చేసింది. దీనికి ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం అన్ని నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేబినెట్ ముందు పెట్టనుంది. దీని ఆధారంగా 8వ వేతన సంఘం అమలు చేస్తారు.
READ ALSO: మీ ఆరోగ్యం కోసం AI కోచ్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన Google..!
జనవరి 1, 2026 నుంచి అమలు
8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.9 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 8వ కేంద్ర వేతన సంఘం తాత్కాలిక సంస్థగా ఉంటుంది. ఇందులో ఛైర్‌పర్సన్, పార్ట్‌టైమ్ సభ్యుడు, సభ్య-కార్యదర్శి ఉంటారు. కమిషన్ ఏర్పడిన తేదీ నుంచి 18 నెలల్లోపు తన నివేదిక, సిఫార్సులను కేబినెట్‌కు సమర్పిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.
వేతన సంఘం ఏం చేస్తుందంటే..
8వ కేంద్ర వేతన సంఘం తన నివేదికను సమర్పించేటప్పుడు అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, అభివృద్ధి వ్యయం, సంక్షేమ చర్యలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయా, నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలకు నిధులు ఎన్ని ఖర్చు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఉద్యోగులకు లభించే జీత భత్యాలు, ప్రయోజనాలు పని పరిస్థితులు వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం దేశంలో 7వ వేతన సంఘం అమలులో ఉంది. దీని ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రస్తుతం 58 శాతంగా అమలులో ఉంది.
సాధారణంగా వేతన కమిషన్ల సిఫార్సులు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అమలు చేస్తారు. అందువల్ల 8వ వేతన కమిషన్‌ను జనవరి 2026 నాటికి అమలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనవరి నాటికి సిఫార్సులు అమలు అవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలలో అవసరమైన మార్పులను సమీక్షించి సిఫార్సు చేయడానికి ప్రభుత్వం 2025 జనవరిలో 8వ కేంద్ర వేతన కమిషన్ ఏర్పాటును ప్రకటించింది.
READ ALSO: Budget Geysers: తక్కువ ధరకు సూపర్ వాటర్ హీటర్లు..! ధర ఎంతో తెలుసా?
