NTV Telugu Site icon

Bhakta Potana Movie: ఎనభై ఏళ్ళ ‘భక్త పోతన’

Bhakta Potana

Bhakta Potana

Bhakta Potana Movie: తెలుగు చిత్రాలకు ఓ గ్లామర్ ను, గ్రామర్ ను తీసుకు వచ్చిన వారిలో దిగ్దర్శకులు కె.వి.రెడ్డి స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలో తొలుత ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన కె.వి.రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘భక్త పోతన’. ఇందులో చిత్తూరు వి.నాగయ్య భక్త పోతనగా నటించి అలరించారు. 1943 జనవరి 7న విడుదలైన ‘భక్త పోతన’ చిత్రం రజతోత్సవం జరుపుకుంది.

‘భక్త పోతన’ చిత్రాన్ని నిర్మించిన ‘వాహినీ’ సంస్థ గురించి ముందుగా ముచ్చటించుకోవాలి. వాహినీ స్టూడియోస్ ను మద్రాసులో మూలా నారాయణస్వామి, బి.యన్.రెడ్డి ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా బి.యన్.రెడ్డి దర్శకత్వంలో ‘వందేమాతరం’ చిత్రాన్ని నిర్మించింది వాహినీ సంస్థ. తరువాత బి.యన్. దర్శకత్వంలోనే “సుమంగళి, దేవత” చిత్రాలను తెరకెక్కించింది. ఆ చిత్రాలకు ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన కె.వి.రెడ్డిని ‘భక్త పోతన’తో దర్శకునిగా పరిచయం చేశారు.

పోతన చారిత్రక ఆధారాలతోనూ, ప్రాచుర్యంలో ఉన్న గాథలనూ ఆధారం చేసుకొని ‘భక్త పోతన’ కథ ను రూపొందించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే – బొమ్మెర పోతన శ్రీరామభక్తుడు. ఆయన భార్య నరసమాంబ, తనయుడు మల్లన, కూతురు లక్ష్మితో కలసి ఏకశిలాపురంలో నివసిస్తూ ఉంటాడు పోతన. ఆయనకు శ్రీరామభక్తితో పాటు కవిత్వమూ అలవడుతుంది. నరసమాంబ అన్నయ్య కవి శ్రీనాథుడు. ఆయన తన కవిత్వంతో రాజులను మెప్పిస్తూ వారిచ్చే భూరిదానాలతో విలాసంగా జీవిస్తూ ఉంటాడు. శ్రీనాథుని కూతురు శారద కూడా తల్లిలేని కారణంగా పోతన కుటుంబంతో కలసి జీవిస్తూ ఉంటుంది. మల్లన అంటే శారదకు ఎంతో ఇష్టం. శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి, భాగవతాన్ని తెలుగు చేయమని పోతనకు చెబుతాడు. దేవుని ఆజ్ఞను శిరసావహించి, పోతన ‘శ్రీమద్భాగవత’ రచనకు పూనుకుంటాడు. ఓ రోజున ఓ పద్యపూరణకు సరైన యోచన రాక, తిరుగుతూ ఉంటే పోతన రూపంలో శ్రీరాముడే వచ్చి, పద్యం పూర్తి చేస్తాడు. పోతన ‘భాగవతం’ గొప్పతనం విని, ఆ కావ్యాన్ని తనకు అంకితమివ్వమని సర్వజ్ఞ సింగభూపాలుడు, శ్రీనాథునితో కబురు పంపుతాడు. అయితే, అది శ్రీరాముని ఆజ్ఞతో రాసిన కావ్యం రామునికే అంకితమన్నది భక్తపోతన సమాధానం. దాంతో సింగభూపాలుడు పోతనను ఇక్కట్లకు గురి చేస్తాడు. కట్టుబట్టలతో ఇల్లు విడిచిన పోతన కుటుంబాన్ని దైవమే రక్షిస్తాడు. ఇంట్లోని భాగవతాన్ని దోచుకోవాలని చూసిన సైనికులకు ఆంజనేయుడు తగిన బుద్ధి చెబుతాడు. సింగభూపాలుని కోటలో పలు దుస్సంఘటనలు ఎదురవుతాయి. దాంతో రాజు పశ్చాత్తాపం చెంది, పోతనను క్షమించమని వేడుకుంటాడు. మళ్ళీ తన నివాసము చేరి, భక్తపోతన తన కావ్యాన్ని స్వామివారికి అంకితమిస్తాడు. పోతన గొప్పతనాన్ని సింగభూపాలుడు కీర్తిస్తాడు. శారద, మల్లన వివాహంతో కథ సుఖాంతమవుతుంది. భక్త పోతన ఎప్పటిలాగే రామకీర్తన చేస్తూ ఆనందిస్తూంటాడు.

ఇందులో భక్త పోతనగా నాగయ్య, శ్రీనాథునిగా గౌరీనాథశాస్త్రి, సింగభూపాలునిగా డాక్టర్ శర్మ, అజామిళునిగా లింగమూర్తి, మల్లనగా శివరామ్, శారదగా మాలతి, నరసమాంబగా హేమలతాదేవి, లక్ష్మిగా కుమారి వనజా గుప్త నటించారు.

ఈ చిత్రానికి బి.యన్.రెడ్డి నిర్మాణ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
రామనాథ సమకూర్చిన కథలో సముద్రాల రాఘవాచార్య సేకరించిన అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్యులు పాటలు, మాటలు రాశారు. “ఈ చిత్ర నిర్మాణమున చారిత్రకాంశములు యథాతథముగా పరిగణించలేదు. మీరు కూడా పరిగణించవలదని మనవి” అని టైటిల్స్ చివర ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం! సినిమా “సర్వధర్మాను పరిత్యజ్య…” అనే నాగయ్య గానం చేసిన శ్లోకం తొలుత వినిపిస్తూ టైటిల్ కార్డ్స్ మొదలవుతాయి. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు సహకార దర్శకునిగా పనిచేశారు. చిత్ర కథానాయకుడు నాగయ్యనే ఈ సినిమాకు స్వరకల్పన చేయడం విశేషం! “ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు…” వంటి పద్యాలతో పాటు “సర్వమంగళ నామా సీతారామా…”, “రామ రామ సీతారామా…”, “పావనగుణ రామహరే…”, “రా పూర్ణ చంద్రికా…”, “నను పాలింపగ చనుదెంచితివా…”, “బాలరసాల సాల నవపల్లవ…”, “ఆటలాడదూ వదినా…”, “ఇది మంచి సమయమూ రా రా…”, “మాతాపితా గురుదేవాహిత…”అంటూ సాగే పాటలు ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి. ఎన్నో ఏళ్ళు శ్రీరామనవమి ఉత్సవాల్లో ఇందులోని శ్రీరాముని భక్తిగీతాలే వినిపించేవి.

‘భక్తపోతన’గా నాగయ్య నటన పండితపామరులను ఆకట్టుకుంది. ఈ ఘనవిజయం తరువాతే నాగయ్య సొంతగా ‘త్యాగయ్య’ తీసి మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ‘భక్త పోతన’ ఆర్థికంగానూ నిర్మాతలకు లాభాలు చేకూర్చింది. తొలి చిత్రంతోనే దర్శకునిగా కె.వి.రెడ్డి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమా తరువాత కేవీ వరుస విజయాలు చూస్తూ చాలా ఏళ్ళు తనదైన బాణీ పలికించారు. ఈ సినిమా రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ చూరగొంది.

Veera Simha Reddy Trailer: ట్రైలర్ తోనే హిట్ కొట్టిన బాలయ్య.. థియేటర్ దబిడిదిబిడే

ఈ చిత్రానికి బి.యన్.రెడ్డి తమ్ముడు, తరువాతి రోజుల్లో విజయా సంస్థ అధినేతల్లో ఒకరిగా సాగిన బి.నాగిరెడ్డి ప్రచారసారథిగా వ్యవహరించారు. ఈ సినిమా సమయంలోనే జెమినీ వారి ‘బాలనాగమ్మ’ కూడా జనం ముందు నిలచింది. బెంగళూరులో ఆ సినిమా పోస్టర్ల జాతర సాగింది. ఆ స్థాయి పబ్లిసిటీ కష్టమని భావించిన నాగిరెడ్డి, విజయవాడ కళాకారులు తయారు చేసిన 30 అడుగుల ఆంజనేయుని కటౌట్ ను బెంగళూరులోని మల్లేశ్వరం సెంటర్ లో ఏర్పాటు చేసి, దాని కింద ‘భక్త పోతన’ పోస్టర్ ఉంచారు. రాత్రికి రాత్రే వెలసిన ఈ కటౌట్ ను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. అది చూసి, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నాగిరెడ్డి ఊహించారు. కొందరు నాగిరెడ్డి మాటను కొట్టిపారేశారు. అయితే ఆయన మాటనే నిజం చేస్తూ అనేక థియేటర్ల వద్ద బుకింగ్ కౌంటర్స్ బద్దలయ్యే స్థాయిలో జనం ‘భక్త పోతన’ను చూడటానికి వచ్చారు.

ఇదే ఇతివృత్తంతో 1966లో గుమ్మడి ‘భక్త పోతన’గా నటిస్తూ గుత్తా రామినీడు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. అందులో నాగయ్య వేదవ్యాసునిగా కనిపించారు. ఎస్వీ రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించారు. ఈ చిత్రం ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. మహానటుడు యన్టీఆర్ చివరి చిత్రంగా విడుదలైన ‘శ్రీనాథకవిసార్వభౌముడు’లోనూ పోతన పాత్ర ఉంటుంది. అయితే అందులో శ్రీనాథునికి, పోతనకు బంధుత్వం అన్నది చూపించక, కేవలం మైత్రీబంధాన్నే ఆవిష్కరించారు.