Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..

Sushila Devi

Sushila Devi

Sushila Devi Inspirational Story: వయసు కేవలం నెంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించారు హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా దేవ్‌నగర్ గ్రామానికి చెందిన 63 ఏళ్ల సుశీలా దేవి. సర్పంచ్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా పదో తరగతిలో 79.6 శాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల కారణంగా కేవలం ఐదో తరగతి వరకే చదువుకోగలిగినప్పటికీ, చదువుపై ఆమెకున్న మమకారం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. పెళ్లి తర్వాత కూడా రోజూ పేపర్లు చదువుతూ, కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందుండేవారు.

ఈ క్రమంలోనే సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అర్హత సాధించాలనే ఆలోచనతో ఆమె తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తల్లి పడుతున్న తపనను గమనించిన కుమారుడు విష్ణు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా పదో తరగతికి దరఖాస్తు చేయించాడు. మొదట్లో సబ్జెక్టులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టినప్పటికీ, పిల్లల సహకారంతో ఆమె రోజుకు 3 నుంచి 4 గంటలు శ్రద్ధగా చదివారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పట్టుదలగా కష్టపడ్డారు. ఏప్రిల్ 2026లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుశీలా దేవి అద్భుతమైన విజయం సాధించారు. మొత్తం 79.6 శాతం మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నారు. సబ్జెక్టుల వారీగా చూస్తే ఇంగ్లీష్‌లో 89, సైన్స్ అండ్ టెక్నాలజీలో 88, మ్యాథ్స్‌లో 78, పెయింటింగ్‌లో 76, హిందీలో 67 మార్కులు సంపాదించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ అద్భుత విజయం తర్వాత యువతకు, మహిళలకు ఆమె ఒకటే మాట చెబుతున్నారు. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని, నేర్చుకోవాలనే తపన ఉంటే కుటుంబం సహకారంతో ఏ లక్ష్యానైనా సులభంగా సాధించవచ్చని నిరూపించి చూపించారు.