జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డుల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశీయుల పేరుతో నకిలీ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డులే ఎక్కువగా ఉన్నాయన్న వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయంలో అధికార జేఎంఎం దేశ హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్రంట్ తెరిచింది.
ఓటర్ల సంఖ్య కంటే కార్డులే ఎక్కువ?
కాగా.. సంతాల్ పరగణా సహా జార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ చొరబాట్ల సమస్య కొత్తేం కాదు. ఇదే కేసు విచారణ ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజాగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డులు తయారయ్యాయని బట్టబయలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చాలా ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 130 శాతానికి పైగా ఉన్నట్లు తేలింది.
జానాభా ఎంత.. ఆధార్ కార్డులు ఎన్ని?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఓటర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరగడాన్ని బీజేపీ సమస్యగా మార్చడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓటర్ కార్డులు తయారు చేశారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి లోహర్దగా జిల్లా మొత్తం జనాభా 5,58,849. ఇక్కడ 6,08,111 ఆధార్ కార్డులున్నాయి. సాహిబ్‌గంజ్ జిల్లాలో 104.40 శాతం ఓటరు కార్డులు తయారు చేశారు. ఇక్కడ మొత్తం జనాభా 13,92,393.. అయితే 14,53,634 కార్డులున్నాయి. పాకూర్ జిల్లాలో కూడా 10,89,673 మందికి గానూ 11,36,959 ఆధార్లు రూపొందించారు. లతేహర్ జిల్లాలో 8,79,774 జనాభాకు ఉండగా.. 9,04,150 ఆధార్ కార్డులు ఉన్నట్లు తేలింది. గర్వా జిల్లాలో 16,00,807 మంది జనాభాకు గాను 16,20,376 ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్..
మరోవైపు జార్ఖండ్‌లో కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ రాకేష్ సిన్హా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఈ ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని ఆరోపించారు. ఇది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, దేశ హోంమంత్రి వైఫల్యమని విమర్శించారు. బీజేపీ నేతలకు కాస్త నైతికత ఉంటే దేశ హోంమంత్రిని సూటిగా ప్రశ్నించాలన్నారు. దేశ హోంమంత్రి సరిహద్దును సరిగ్గా నిర్వర్తించడం లేదని.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.