NTV Telugu Site icon

Meat Plant : పంజాబ్ లో ఘోరం.. మీట్ ప్లాంట్‎లో నలుగురు కూలీలు దుర్మరణం

Dera

Dera

Meat Plant : పంజాబ్‌లోని డేరా బస్సీలోని ఫెడరల్ మీట్ ప్లాంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం గ్రీజు ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కూలీలు ఒకరి తర్వాత ఒకరు గ్రీజు ట్యాంక్‌లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషపూరిత పొగ వెలువడింది. దాన్న పీల్చి నలుగురు చనిపోగా.. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. కాలక్రమేణా ట్యాంక్‌లో పేరుకుపోయిన గ్రీజును శుభ్రం చేయడానికి ఒక కార్మికుడు ట్యాంక్‌లోకి ప్రవేశించాడు. మొదటి వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో, రెండవవాడు లోపలికి వెళ్లాడు. అయితే అతను కూడా విషపూరిత పొగను పీల్చాడు. దీంతో సృహతప్పి పడిపోయాడు.

అతను రాకపోవడంతో ఆ తర్వాత.. మరో ఇద్దరు కార్మికులు ట్యాంక్‌లోకి ప్రవేశించారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. ట్యాంకులోకి వెళ్లిన వారంతా బయటకు రాకపోవడంతో వారికి ఏమైందో తెలుసుకునేందుకు తాను వెళ్లినట్లు అస్వస్థతకు గురైన వారిలో ఒకరు వివరించారు. ‘ఎవరూ బయటకు రాకపోవడంతో నేను ట్యాంక్‌లోకి ప్రవేశించి విషపూరిత పొగలు పీల్చి స్పృహతప్పి పడిపోయాను. తర్వాత స్థానికంగా ఉన్న వారు నన్ను రక్షించారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. కానీ మిగిలిన నలుగురు కూలీలు విషపూరిత పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారు.” అని చెప్పాడు. మృతులను మనక్, శ్రీధర్ పాండే, కుర్బన్, జనక్‌లుగా గుర్తించారు. వారి మృతదేహాలను డేరా బస్సీ సివిల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.