Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సతారా నుంచి థానేలోని డోంబివిలీకి వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు స్వామినారాయణ దేవాలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీ కొట్టిందని పోలీసులు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు. బస్సులో ముగ్గురు ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ మృతి చెందగా, 22 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు.
Read Also : Weather Updates : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. రెండు వాహనాలు రోడ్డుపై ఢీకొట్టుకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందం క్రేన్‌ల సహాయంతో వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
Read Also :Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు
‘‘ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఇక్కడికి వచ్చిన తర్వాత.. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు నాకు సమాచారం అందించారు. విచారణ కోసం వేచి చూస్తాం. పోలీసులు, ఇతర అధికారులు చక్కగా పని చేసి క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు’’ అని సుప్రియా సూలే పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.