Site icon NTV Telugu

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 30 మంది దుర్మరణం

Road Accident

Road Accident

Road Accident: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ఓ ప్యాసింజర్​ బస్సు, కారును బలంగా ఢీకొట్టిన అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో 30 మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై మంగళవారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో లోయలోకి పడిపోయాయి. ప్యాసింజర్ బస్సు గిల్గిట్ నుంచి రావల్పిండికి వెళ్తోందని పోలీసులు తెలిపారు.

గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రావిన్స్‌లోని షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుండి రావల్పిండికి వెళ్తున్న ప్రయాణీకుల బస్సు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Golden Gavel Award: అమెరికాలో తెలుగు వాడి సత్తా..పిట్ట కొంచెం కూత ఘనం

మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోహిస్థాన్‌లో జరిగిన బస్సు ప్రమాదంపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి గాయపడిన వారిని తరలించి వారికి వైద్య సదుపాయాలు అందించాలని ఖలీద్ ఖుర్షీద్ పరిపాలన, అన్ని సంబంధిత విభాగాలను ఆదేశించారు. మెరుగైన సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను రూపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియా భూకంపం.. 7,800 మందికి పైగా మృతి

జనవరి 29న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ప్రయాణీకుల కోచ్ లోయలో పడి 41 మంది మరణించారని డాన్ నివేదించింది. ఈ ఘటన బలూచిస్థాన్‌లోని లాస్బెలా జిల్లాలో చోటుచేసుకుంది. డాన్ నివేదిక ప్రకారం.. క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో వాహనం వెళుతోందని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ తెలిపారు. లాస్బెలా సమీపంలోని వంతెన పిల్లర్‌ను వాహనం ఢీకొట్టిందని, ఆ తర్వాత లోయలో పడి మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు.

Exit mobile version