Central Government Schemes: రైతు సంక్షేమాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విశేషమైన పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు రైతులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంటే, మరికొన్ని పథకాలు వృద్ధాప్యంలో పెన్షన్ ఆసరాను, అలాగే సాగు ఖర్చుల కోసం అత్యంత సులభంగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతోమంది అర్హులైన రైతులు ఈ ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. మీరు కూడా వ్యవసాయం చేస్తున్నట్లయితే, మీకు ఎంతగానో ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు అద్భుతమైన పథకాల వివరాలు తప్పక తెలుసుకోవాలి. అవే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC).
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి..
దేశంలో రైతులకు అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) మొదటి వరుసలో ఉంటుంది. సాగు భూమి ఉన్న అర్హులైన రైతులకు ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం జమ చేస్తుంది. వ్యవసాయ అవసరాలతో పాటు ఇంట్లోని చిన్న చిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రైతులకు అదనపు ఆసరాగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన..
చిన్న, చిన్నకారు రైతులకు వృద్ధాప్యంలో కొండంత ఆర్థిక భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ను ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండి, గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మాత్రమే సాగుభూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. పథకంలో చేరిన వయస్సును బట్టి రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు తమ కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా రూ.3,000 స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్..
వ్యవసాయం చేసే సమయంలో విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, క్రిమిసంహారక మందులు, కూలీల ఖర్చులు, ఇతర సాగు పనుల కోసం రైతులకు భారీగా డబ్బు అవసరమవుతుంది. అలాంటి సమయంలో రైతులకు చౌకగా, చాలా సులభంగా రుణాలు అందించడానికి ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (KCC) సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా రైతులు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. కేవలం పంటల సాగుకే కాకుండా పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో ఉన్న అర్హులైన లబ్ధిదారులు కూడా కేసీసీ ద్వారా రుణ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ఈ పథకం కింద లభించే రుణ పరిమితి అనేది రైతుకు ఉన్న భూమి, పంటల నమూనా, సాగు ఖర్చు, ఆర్థిక అవసరాల ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. బ్యాంకులు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత క్రెడిట్ లిమిట్‌ను ఖరారు చేస్తాయి. అర్హులైన రైతులకు ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు రుణం లభించే వెసులుబాటు ఉంది. దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడిని సులభంగా సమకూర్చుకోవచ్చని, అలాగే వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం ఎంతగానో తగ్గుతుంది.

