NTV Telugu Site icon

Suswagatham Movie: పాతికేళ్ళ ‘సుస్వాగతం’

Suswagatham

Suswagatham

Suswagatham Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ ‘ఖుషి’ చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం ‘ఖుషి’ ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి ‘సుస్వాగతం’ పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాతో పవన్ కు హీరోగా మంచి విజయం లభించింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఆ రోజుల్లో యువతకు ఓ సందేశంగా ఈ సినిమా నిలచిందని చెప్పవచ్చు.

‘సుస్వాగతం’ కథ ఏమిటంటే – గణేశ్ అనే డిగ్రీ చదివే అబ్బాయి నాలుగు ఏళ్ళుగా సంధ్య అనే అమ్మాయికి తన మనసులోని మాట చెప్పి, ప్రేమను తెలుపాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే అవేవీ పట్టని సంధ్య అతడిని ఏ మాత్రం పట్టించుకోదు. తనను ఫాలో కావడం మానేయమనీ గణేశ్ కు చెబుతుంది. అయినా పట్టువదలని విక్రమార్కునిలా గణేశ్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది గమనించిన సంధ్య తండ్రి పోలీస్ ఇన్ స్పెక్టర్ వాసుదేవరావు, గణేశ్ ను సెల్ లో వేస్తాడు. గణేశ్ తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ కొడుకును బెయిల్ పై బయటకు తీసుకు వస్తాడు. తల్లిలేని గణేశ్ ను చంద్రశేఖర్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచడమే కాదు, ఓ స్నేహితునిలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. గణేశ్ మిత్రులు సైతం చంద్రశేఖర్ తో ఇట్టే కలిసిపోతూంటారు. తనయుడి కోసం సంధ్య ఇంటికి వెళ్ళి పెళ్ళి ప్రస్తావన తెస్తాడు చంద్రశేఖర్. అయితే సంధ్య తండ్రి ఆయనను అవమానించి పంపుతాడు.

సంధ్య తండ్రి ఆమెను హైదరాబాద్ కు తీసుకువెళ్ళి తన సోదరి ఇంట్లో పెట్టాలని భావిస్తాడు. ఈ విషయం తెలిసిన గణేశ్ హైదరాబాద్ వెళతాడు. అయితే మధ్యలోనే తన నిర్ణయం మార్చుకొని సంధ్యను వెనక్కి తీసుకు వస్తాడు వాసుదేవరావు. ఈ విషయం తెలియని గణేశ్, సంధ్య కోసం హైదరాబాద్ లో పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. సరిగా అదే సమయంలో అతని తండ్రి మరణిస్తాడు. అతని కోసం మిత్రులు ఎంతగానో ప్రయత్నిస్తారు. చివరకు పోస్టర్స్ తయారుచేసి, హైదరాబాద్ బస్సులకు అంటిస్తారు. గణేశ్ రాకపోయేసరికి, అతని మిత్రులే చంద్రశేఖర్ కు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తరువాత బస్సుపై పోస్టర్ చూసిన గణేశ్ తల్లడిల్లిపోతాడు.

తాను ఏమి పోగొట్టుకున్నానో అర్థం చేసుకుంటాడు. ఇదే సమయంలో సంధ్యలో గణేశ్ ప్రేమను అర్థం చేసుకొనే భావం మొదలవుతుంది. తండ్రి మరణంతో గణేశ్ లో ఎంతో మార్పు వస్తుంది. అతను ఎప్పటిలాగే తయారై మిత్రులతో కలసి వెళ్తాడు. అప్పుడు గణేశ్ తో మాట్లాడాలంటుంది సంధ్య. ఆమె తన మనసులో మాట చెబుతుంది. కానీ, గణేశ్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. తాను ఆమె ప్రేమకోసం నాలుగేళ్ళుగా తిరిగానని, ఈ నేపథ్యంలో కన్నతండ్రిని కూడా పోగొట్టుకున్నానని అంటాడు. అలాంటి ప్రేమ తనకు వద్దనీ చెప్పేస్తాడు. ఈ నిర్ణయం తనలా అమ్మాయిల వెంట పడే అమాయకులైన అబ్బాయిల కోసం తీసుకుంటున్నాననీ అంటాడు. కానీ, తన కోసం ఇంతకు ముందు గణేశ్ ఎప్పుడూ ఎదురుచూసే బస్టాప్ లోనే అతని కోసం సంధ్య ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది. ఆమె అలాగే గణేశ్ రాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ, ఇంట్లో గణేశ్ తయారై తన తండ్రి చెప్పిన చోట ఉద్యోగంలో చేరడానికి వెళ్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసి, మిత్రులూ సంతోషించడంతో కథ ముగుస్తుంది.

NBK108: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

పవన్ కళ్యాణ్, దేవయాని, సాధిక, ప్రకాశ్ రాజ్, రఘువరన్, కరణ్, సుధాకర్, తిరుపతి ప్రకాశ్, బండ్ల గణేశ్, సుధ, వర్ష, వై.విజయ, పావలా శ్యామల, వేణు మాధవ్, నవీన్, మాధవిశ్రీ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి తమిళంలో రూపొందిన విజయ్ ‘లవ్ టుడే’ ఆధారం. బాలశేఖరన్ కథకు చింతపల్లి రమణ మాటలు రాశారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ బాణీలకు సీతారామశాస్త్రి, షణ్ముఖ శర్మ, భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “సుస్వాగతం నవరాగమా…”, “యే స్వప్నలోకాల సౌందర్యరాశి…”,”హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు…”, “ఆలయాన హారతిలో…”, “ఫిగరు మాట…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంతో ప్రకాశ్ రాజ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. “నేను మోనార్క్ ని నన్నెవ్వరూ మోసం చేయలేరు…” అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ మంచి ఆదరణ పొందాయి. ‘సుస్వాగతం’ చిత్రం మంచి విజయం సాధించి. పవన్ కు హీరోగా మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా విడుదలైన దాదాపు తొమ్మిదేళ్ళకు పవన్ కళ్యాణ్, భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్ లో ‘సుస్వాగతం’ నిర్మించిన ఆర్.బి.చౌదరియే ‘అన్నవరం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.