Site icon NTV Telugu

Bus Accident: అదుపుతప్పి నదిలో పడిన ప్రైవేట్ బస్సు.. 24 మంది మృతి

Bus Accident

Bus Accident

Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దొంగర్‌గావ్‌ గ్రామ సమీపంలో బొరాద్‌ నదిపై నిర్మించిన వంతెన మీదుగా బస్సు ప్రయాణిస్తుండగా డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వేగంగా వెళ్తున్న బస్సు రెయిలింగ్‌ను బద్దలుకొడుతూ నదిలో పడిపోయింది.

Read Also: Salman Khan: సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తా.. బాలీవుడ్‌ నటుడికి బెదిరింపు మెయిల్

బస్సు పడిన చోట నీటిప్రవాహం లేదని తెలుస్తోంది. 37 మందికే సీటింగ్‌ సామర్థ్యమున్న బస్సులో ఏకంగా 70 మంది ప్రయాణిస్తున్నారని, ఫిట్‌నెస్‌ లేని బస్సు వేగంగా ప్రయాణించడమూ ప్రమాదానికి కారణమని సర్కారు తెలిపింది. ఫిట్‌నెస్‌లేని బస్సుకు అనుమతినిచ్చిన అసిస్టెంట్‌ రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ను సర్కారు సస్పెండ్ చేసింది. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్‌ గ్రేషి యా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

Exit mobile version