Site icon NTV Telugu

2028 Olympics: ఒలింపిక్స్‌లో ఆరు క్రికెట్ టీమ్స్.. అమెరికాకు డైరెక్ట్‌ ఎంట్రీ!

2028 Olympics Cricket

2028 Olympics Cricket

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో శతాబ్దకాలం తర్వాత క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కిన విషయం తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత.. లాస్‌ ఏంజిలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగం కానుంది. విశ్వ క్రీడల నిర్వహణ కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు తాజాగా నిర్వాహకులు ధృవీకరించారు. ఆతిథ్య హోదాలో అమెరికాకు డైరెక్ట్‌ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2032లో బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ ఉంటుంది.

2028 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో 6 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఒక్కో టీమ్ నుంచి 15 మంది ఆటగాళ్ల చొప్పున.. మొత్తం 90 మంది క్రికెటర్లకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతిని ఇచ్చింది. ఒలింపిక్స్‌కు అర్హత ప్రమాణాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ.. ఆతిథ్యమిస్తున్నందున అమెరికా నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. మిగతా ఐదు జట్ల కోసం ఎంపిక ప్రక్రియ ఉండనుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 5 జట్లు 2028 ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Virat Kohli: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ఆ వీడియోలను తొలిగించిన విరాట్‌ కోహ్లీ!

తొలిసారి, చివరిసారిగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ నిర్వహించారు. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో నెగ్గింది. ఆపై తర్వాత పలు కారణాలతో క్రికెట్‌ను ఒలింపిక్స్‌ పోటీల నుంచి తప్పించారు. దాదాపు 128 ఏళ్ల తర్వాత మరలా విశ్వ క్రీడలో క్రికెట్ భాగమవుతోంది. 2028లో మొత్తం 351 ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

Exit mobile version