Site icon NTV Telugu

Honda Shine: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! మార్కెట్లోకి కొత్త హోండా షైన్

Honda Shine 2025

Honda Shine 2025

Honda Shine: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ ఇండియా తన బ్రాండ్‌కు మరో అద్భుతమైన మోడల్‌ను జోడించింది. భారతదేశంలోని మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని హోండా 2025 షైన్ 125 బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ముందుండడం విశేషం. హోండా ద్విచక్ర వాహనాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా హోండా టూవీలర్స్‌ను ఎన్నుకుంటారు. ఎందుకంటే, అవి తక్కువ ధరలో లభించడంతో పాటు మైలేజ్ పరంగా అద్భుతంగా రాణిస్తాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో మంచి మైలేజ్ ఇచ్చే బైకులు వినియోగదారులకు వరంగా మారాయి.

Read Also: GHMC: పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం..

ఇక 2025 మోడల్ హోండా షైన్ 125 ధర రూ. 84,493 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఇది 123.94cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 10.63 bhp పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో ఇది మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే లీటర్‌కు 55 కి.మీ వరకు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్రేకింగ్ వ్యవస్థలో డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్లు ఉంటాయి. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ అందించడంతో రైడింగ్ మరింత సౌకర్యంగా ఉంటుంది.

హోండా ఈ కొత్త మోడల్‌ను ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది. ముఖ్యంగా OBD2B ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి, ఇంజిన్ పనితీరును మెరుగుపరిచారు. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఇవి రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేలా ఉంటాయి. 2025 హోండా షైన్ 125 గత మోడల్‌లతో పోలిస్తే డిజైన్‌లో తక్కువ మార్పులు ఉన్నా, ఫీచర్లు అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇది పెర్ల్ సైరెన్ బ్లూ, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రెబెల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది.

Read Also: Toilet Usage Management Rule: ఉద్యోగులు టాయిలెట్స్ వినియోగంపై వింత రూల్స్!

ఈ కొత్త మోడల్ హీరో సూపర్ స్ప్లెండర్ 125, టీవీఎస్ రైడర్ 125 వంటి బైకులకు గట్టి పోటీ ఇవ్వనుంది. బడ్జెట్ రేంజ్‌లో మెరుగైన మైలేజ్ మరియు అధునాతన ఫీచర్లతో హోండా షైన్ 125 మధ్యతరగతి ప్రజలకు ఉత్తమ ఎంపికగా మారనుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా కూడా తక్కువ ఖర్చుతో, అధిక మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నవారికి 2025 హోండా షైన్ 125 ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్. హోండా తన వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ మోడల్, మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం.

Exit mobile version