NTV Telugu Site icon

Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!

Road Accident

Road Accident

2 Peoples Died in Road Accident at Vizianagaram: రాఖీల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఒకే కుంబానికి చెందిన ఇద్దరు (బాబాయ్, అమ్మాయి) ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సీఐ రవికుమార్‌ వివరాల ప్రకారం… వచ్చే నెలలో రాఖీ పండగ ఉన్న నేపథ్యంలో ముందుగానే రాఖీలను కొనుగోలు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన గెంబలి రవి కుమార్‌ (42), అతని అన్నయ్య కుమార్తె గెంబలి నవ్య (19) మంగళవారం చీపురుపల్లిలోని టోకు దుకాణానికి వెళ్లారు. వీరితో పాటు అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు కూడా రాఖీల కొనుగోలుకు చీపురుపల్లి వెళ్లారు. రాఖీల కొనుగోలు అనంతరం నలుగురు రైలులో పొందూరు వెళ్లి పోగా.. రవి, నవ్య మాత్రం స్కూటీపై ఇంటికి బయలుదేరారు.

Also Read: Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం!

రవి కుమార్‌ స్కూటీ డ్రైవ్ చేస్తూ ముందు ఓ రాఖీల బస్తా పెట్టుకోగా.. నవ్య వెనుక కూర్చొని మధ్యలో మరో సంచి పట్టుకుని ఉంది. మంగళవారం రాత్రి రాజాం పట్టణంలోని గాయత్రీ కాలనీ సమీపంకు రాగానే వీరు రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న రాజాం పట్టణం సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్కూటీపై ఉన్న బస్తాను తొలుత ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతులు రవి కుమార్‌, నవ్య రోడ్డుపై పడి ఉంటారని.. అదే సమయంలో ట్యాంకర్‌ వీరి తలలపై నుంచి వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవ్యకు కొన్ని రోజులుగా ఇంట్లోవారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. యువతకు నచ్చే రాఖీలను ఎంపిక చేసేందుకు చిన్నాన్నతో వెళ్లిన ఆమె ప్రమాదంలో చిక్కుకుంది. నవ్య మృతితో తల్లిదండ్రులు సురేష్‌, సరోజిని కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు అన్నీ తానై కుటుంబాన్ని నడిపిస్తున్న రవి మృతితో అతడి భార్య లావణ్య బోరుమంటోంది.

Also Read: Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు