NTV Telugu Site icon

Russia-Ukraine war: పుతిన్ పిలుపుతో సైన్యంలో చేరిన రష్యా పౌరులు

Russia War

Russia War

Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు ఆరునెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధంలో గెలవాలన్న కసితో ఏ దేశం కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసేందుకు కావాల్సిన సైన్యాన్ని పటిష్ఠం చేసుకునే పనిలో పడింది. ఇందుకు భారీగా సైనిక సమీకరణకు దిగింది. పుతిన్ సైనిక దళంలో చేరాలంటూ రష్యా పౌరులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. నిర్బంధ సైనిక సమీకరణ చేయడానికి ఆ దేశాధికారులు దిగారు. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారే కాకుండా పౌరులు కూడా రష్యా ఆర్మిలో చేరాలంటూ పుతిన్ ప్రజలను కోరారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది ఆర్మీలో చేరినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గేయే షోయిగు ఇటీవల తెలిపారు.

రష్యాకు సైనిక సమీకరణ తిప్పలు తప్పడం లేదు! పుతిన్‌ ప్రకటన మొదలు ఇప్పటికే వేలమంది రష్యాను వీడగా.. ఇక్కడున్న వారిలోనూ అర్హుల ఎంపిక కష్టతరమవుతోంది. తాజాగా ఇక్కడి ఖబరోవ్స్క్‌ ప్రాంతం నుంచి సైన్యంలో చేరేందుకు పిలుపు వచ్చిన వేలమందిని అధికారులు వెనక్కు పంపారు. కారణం.. వారు ఆర్మీ కనీస ప్రమాణాలు అందుకోకపోవడమే. ఈ క్రమంలోనే స్థానిక మిలిటరీ కమిషనర్‌ను తొలగించడం గమనార్హం. ‘ఖబరోవ్స్క్ మిలిటరీ కమిషనర్ యూరి లైకో సస్పెండ్‌ అయ్యారు. అయితే, సైనిక సమీకరణ ప్రక్రియపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు’ అని గవర్నర్‌ మిఖాయిల్ డెగ్తియారోవ్ సోమవారం వెల్లడించారు.

Read Also: Uttarakhand Bus Accident:ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ పెళ్లి బస్సు.. 25 మృతి

ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా కూడా భారీగానే సైనికులను కోల్పోతోంది. దీంతో దాదాపు 3లక్షల మంది సైనిక బలగాన్ని సమకూర్చుకునేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుంది. వీరందరినీ బృందాలుగా విభజించి 80ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ఏకంగా 6శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరో వైపు నిర్బంధ సైనిక సమీకరణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు దేశం విడిచి పారిపోతున్నారు. రెండు వారాల కాలంలో రెండు లక్షల మంది రష్యా పౌరులు సరిహద్దులు దాటి తమ దేశంలో ప్రవేశించినట్లు ఖజకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు రష్యా ఆ దేశానికి చెందిన రైతులను కూడా సైన్యంలో భాగం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.