మహారాష్ట్రలోని పూణెలో గత ఆదివారం ఓ బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి యువకుల ప్రాణాలు తీశాడు. అనంతరం నిందితుడికి వెంటనే బెయిల్ రావడం.. తర్వాత దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనంతరం బెయిల్ రద్దైంది. ఇక ఈకేసులో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇన్‌స్పెక్టర్ రాహుల్ జగ్దలే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ తోడ్కరీలపై ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇద్దరినీ యెరవాడ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ చేశారు. మరోవైపు ఈ కేసును పూణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్ ప్రక్రియ నిలపాలి.. యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ
ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్‌ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Medha Patkar: మేధా పాట్కర్‌కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
