Site icon NTV Telugu

Sidhu Moose Wala: పంజాబ్‌ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం

Sidhu Moosewala

Sidhu Moosewala

Sidhu Moose Wala: పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు. గత ఏడాది గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఇద్దరికీ సంబంధం ఉందని వారు తెలిపారు. వారు ఇతర కేసులు కూడా ఎదుర్కొంటున్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ఈ ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడని తెలిపారు. ముగ్గురూ ఒకే వర్గానికి చెందినవారు అని చౌహాన్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్‌దీప్‌ తూఫాన్, మన్మోహన్‌ సింగ్, కేశవ్‌ల మధ్య తరన్ తరణ్ జిల్లాలోని జైలులో ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. గ్యాంగ్‌స్టర్స్‌ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్లు మన్‌దీప్‌ తూఫాన్‌, మన్మోహన్‌ సింగ్ మృతి చెందగా.. మరో గ్యాంగ్‌స్టర్ కేశవ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్‌లోని తరణ్ జైలులో ఉన్న నిందితుల మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తిందనేది గమనార్హం.

Read Also: Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి

సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ మే 29న మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. మూసేవాలాను హత్య చేసిన కేసులో నిందితులైన మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. జైలులో గ్యాంగ్ వార్ జరగడంతో ఇద్దరు నిందితులు చనిపోగా, తీవ్రంగా గాయపడిన కేశవ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version