NTV Telugu Site icon

Mobile Tower Stolen In Bihar: అసలుసిసలు దొంగతనమంటే ఇదీ.. పట్టపగలే సెల్ టవర్ చోరీ

Cell Tower

Cell Tower

Mobile Tower Stolen In Bihar: దొంగలంటే అందరూ పడుకున్నాక రాత్రిళ్లు ఇళ్లల్లో చొరబడి విలువైన సామగ్రి ఎత్తుకుపోతారని తెలుసు. లేకపోతే జేబు దొంగలు, చైన్ స్నాచర్ల గురించి విన్నాం కానీ.. ఏ దొంగతనంలోనూ ఎవరైనా పట్టుకుంటారేమోనన్న భయంతోనే దొంగలు ఇంతటి సాహసాలు చేస్తుంటారు. కానీ పట్టపగలే ఊరు మధ్యలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నే లేపేశారంటే వాళ్ల గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

బీహార్‌ రాజధాని పాట్నాలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఓ దొంగల ముఠా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ సెల్ టవర్‌ను ఎత్తుకెళ్లింది. కచ్చి తలాబ్ ప్రాంతంలో ఓ మొబైల్ సర్వీస్ కంపెనీ సెల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆ సెల్‌ టవర్‌కు కొన్ని నెలలుగా ఓ కంపెనీ అద్దె చెల్లించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన ఓ దొంగల ముఠా సెల్ టవర్‌ను దొంగిలించడానికి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే సెల్ టవర్‌ ఉన్న స్థలం యజమానితో ముందుగానే దొంగలు మాట్లాడారు. తాము టవర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అధికారులమని, కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేకపోతున్నామని చెప్పారు.

Read Also: Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?

సెల్‌ఫోన్‌ టవర్‌ను రెండు మూడు రోజుల్లో వచ్చి విప్పుకెళ్తామని స్థలం యజమానితో దొంగల ముఠా సభ్యులు చెప్పారు. దాంతో స్థలం యజమాని వారికి ఓకే చెప్పాడు. చెప్పినట్టే రెండు రోజుల తర్వాత దొంగల ముఠా సభ్యులు వచ్చి.. పట్టపగలే అందరూ చూస్తూండగానే 2-3 రోజులలో టవర్‌ను నేలమట్టం చేశారు. ఆపై విడి భాగాలను ఓ ట్రక్కులో వేసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుకున్న సెల్‌ టవర్‌ అధికారులు స్థలం యజమానిని అడగ్గా.. అతడు అంతా వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. టవర్‌ను కూల్చివేసేందుకు దాదాపు 25 మంది సెల్‌ఫోన్‌ టవర్‌ వద్దకు వచ్చారట. పెద్ద సుత్తెలు, గ్యాస్ కట్టర్‌ లాంటి ఆయుధాలతో సంఘటనా స్థలానికి వచ్చారట. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆదివారం కేసు నమోదు అయింది. 19 లక్షల రూపాయల విలువైన మొబైల్ టవర్‌ను దొంగలు దోచుకున్నారని కంపెనీ అధికారులు చెప్పారు.