Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఉదయం 9.55 గంటలకు ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా.. డ్రైవర్ చక్రాల నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి నసీర్ ఉద్దీన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది బస్సును జలదిగ్బంధం నుంచి వెలికి తీశారు. బస్సులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Also Read: Delhi floods: ఇంకా వరదల్లోనే ఢిల్లీ.. హథినికుండ్ బ్యారేజీ నుంచి మళ్లీ నీటి విడుదల
జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ జహీరుల్ ఇస్లాం ప్రకారం.. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలం నుంచి 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్-ఎ-బంగ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్చారు. ఈ ప్రమాదం తర్వాత ఖుల్నా-ఝలకతి రహదారిపై వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.