NTV Telugu Site icon

Reactor Explosion: మాటలకందని విషాదం.. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 14 మంది మృతి

Fire Accident

Fire Accident

Reactor Explosion: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది.

Read Also: Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం.. ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం

శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావించి.. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను అధికారులు తెప్పించారు. 5గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంబులెన్సుల్లో మృతదేహాలు, బాధితులను తరలిస్తున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన పరిశ్రమ శిథిలాల కింద కార్మికులు నుజ్జునుజ్జయ్యారు. 33మంది ప్రభావానికి గురయ్యారని అధికారులు ప్రకటించారు.ఎసెన్షియా ఫార్మా కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి.

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.