NTV Telugu Site icon

Sabarimala: శబరిమలలో అపశృతి.. ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల బాలిక

Sabarimala

Sabarimala

Sabarimala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చాలా సేపు క్యూలో వేచి ఉండటంతో కిందకు పడిన బాలికను గుర్తించిన ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. దీంతో కొండంతా అయ్యప్ప భక్తులతో కిటకిటలాడింది. క్యూలో ఎక్కువసేపు వేచి ఉండలేక, చాలా మంది యాత్రికులు క్యూ వ్యవస్థను అధిగమించి బారికేడ్లను దూకేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పవిత్ర మెట్ల దగ్గర రద్దీ పెరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు సైతం భక్తులను ఆపలేకపోతున్నారు. ఈ పరిస్థితులు అక్కడ గందరగోళం సృష్టిస్తున్నాయి.

Read also: Bhatti Vikramarka: ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం..

మరోవైపు రద్దీ పెంపుపై కేరళ మంత్రి రాధాకృష్ణన్‌, ట్రావెన్‌కోర్‌ బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితి 10,000 తగ్గింది. అంతేకాకుండా రోజుకు గరిష్టంగా వచ్చే భక్తుల సంఖ్య 90 వేల నుంచి 80 వేలకు తగ్గింది. అదేవిధంగా భద్రతా చర్యలను పటిష్టం చేయడంలో భాగంగా సన్నిధానంలో ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే వైద్య సేవలు అందిస్తామన్నారు. కాగా, రెండు నెలల సుదీర్ఘ దర్శనంలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని గత నెల 17న తెరిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మండల-మకరవిళక్కు ఉత్సవాలు 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో విపరీతమైన రద్దీ నెలకొంది.
Serial Killer: పూజలతో అమాయకులకు ఎర.. 20 మందిని చంపిన తాంత్రికుడు..!