Student Suicide: విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. అందరి కంటే బాగా చదవాలి, మొదటి స్థానంలో నిలవాలన్న లక్ష్యాలతో సతమతమవుతున్నారు. శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ పరీక్షలు అనే సరికి భయాందోళనకు గురవుతున్నారు. సరిగ్గా రాయలేదనో, అంచనాలను అందుకోలేకపోయమనో, ర్యాంక్ రాలేదనో, పాస్ అవలేదనో ఇలా ఎన్నో కారణాలతో విద్యార్థులు.. తమ నిండు జీవితాన్ని ముగించేస్తున్నారు. వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగుల్చుతున్నారు.
Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్‌జిత్ పంజ్వార్ హత్య!
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబు కోటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో చీరతో దూలానికి ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో మరో విద్యార్థిని కామేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. పదో తరగతి ఫలితాల్లో గణితంలో కామేశ్వరి ఫెయిల్ కాగా.. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి ప్యాపిలి కస్తూరిబా విద్యాలయంలో చదువుకుంటోంది. కామేశ్వరి మృతితో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.