నేడు దేశమంతటా ప్రజలు ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న వేళ, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాలు తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. సికింద్రాబాద్లోని బండిమెట్లో ఉన్న బాలాజీ మెడికల్ షాప్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అలాగే.. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఒక మెడికల్ గోదాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మూడవ అంతస్తులో మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
మరొక ఘటనలో.. కాటేడాన్లోని హెచ్కే గారినై వెల్స్ పరిశ్రమలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ కంపెనీకి కూడా వేగంగా విస్తరించాయి. వెంటనే స్పందించిన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ (DRF) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న మరో రెండు కంపెనీలను అధికారులు ఖాళీ చేయించారు.
మరోవైపు.. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ గోదాం నుంచి ఎగసిపడిన అగ్నికీలలు పక్కనే ఉన్న ప్లైవుడ్ షాపులకు వేగంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వరుస అగ్నిప్రమాదాల వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు రక్షణ చర్యలను వేగవంతం చేసి, ప్రమాదాలకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

