Site icon NTV Telugu

100Days Movie: షోలు పడకుండానే శతదినోత్సవాలా?

100days

100days

100Days Movie: ఒకప్పుడు సినిమాల విజయానికి సదరు చిత్రాలు శతదినోత్సవం ప్రదర్శితం కావడం కొలమానంగా ఉండేది. అంతకు మించి ఆడితే ఆ సినిమా మరెంతో విజయం సాధించిందని భావించేవారు. అయితే అప్పట్లో కొన్ని చిత్రాలు నిజాయితీగా ప్రదర్శితమయ్యేవి. మరికొన్ని అదే పనిగా థియేటర్ వారికి నష్టం రాకుండా లోపాయికారి ఒప్పందాలతో ఆడేవి. అందువల్ల ఆ రోజుల్లో సినిమాల ఉత్సవాలను చూసి జనం “ఆడినవి, ఆడించినవి” అంటూ రెండుగా విభజించి చెప్పుకొనేవారు. కానీ, ఇప్పుడు మూడోరకం సినిమాలు కూడా వచ్చాయి. అవేమిటంటే, సినిమాలు ఆడకున్నా ఏదో ఒక థియేటర్ వద్ద వంద రోజుల పోస్టర్ పెట్టి ఉత్సవాలు చేసుకోవడం! ఇటీవల మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమాను అదే తీరున చిత్తూరు జిల్లా అరగొండలో ఆడకపోయినా వందరోజుల వేడుక జరిపారు. ఈ విషయాన్ని అసలైన అక్కినేని అభిమానులు తీవ్రంగా ఖండించారు. అయినా కొందరు అభిమానులకు ఇంకా కనువిప్పు కలుగలేదు.

Read Also:Cinema to the people: ప్రజల వద్దకు సినిమా. ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఇంట్లోనే చూసేందుకు ఏపీలో ఏర్పాట్లు

ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు కర్ణాటకలోని ముళబాగిలులో అదే తీరున ప్రదర్శితం అయ్యాయి. అంటే రెండు థియేటర్లలో సదరు హీరోల చిత్రాల పోస్టర్స్ తగిలించి, ఆడకపోయినా ఆడుతున్నట్టు రోజులు లెక్కకడుతున్నారన్నమాట! ఈ విషయం వెలుగులోకి వచ్చి వైరల్ కాగానే, సదరు చిత్రాలను తీసి వేశారనుకోండి. అది వేరే విషయం! ఇవే చిత్రాలలో ఓ సినిమా మన తెలుగునాట అదే తీరున సాగుతూ ఉండడం గమనార్హం!

సదరు చిత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వంద రోజులు ఆడించడం కోసం రూ.9 లక్షలు థియేటర్ వారికి చెల్లించారట. ఎందుకంత ఇది అంటే, ఆ కేంద్రంలో పోటీ హీరోకు ఇప్పటికే ఐదు సినిమాలు వంద రోజులు ఆడిన క్రెడిట్ ఉన్నదట! కానీ మన హీరోకి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా లేదని, కనీసం టాక్ వచ్చిన ఈ చిత్రాన్నైనా వందరోజులు ఆడించాలని అభిమానులు కోరారు. వారి అభిలాషను మన్నించి హైదరాబాద్ నుండి పెద్దలు జోక్యం చేసుకొని ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. అయితే సదరు థియేటర్ యజమాని, డబ్బు తీసుకున్నందుకుగాను తమ థియేటర్ లో వేరే సినిమాను ప్రదర్శించముగాని, సదరు సినిమాను రోజూ ఆడిస్తూ వందరోజులు నడపాలంటే ప్రతి షోకు కనీసం ఇరవై టిక్కెట్లు అభిమానులు కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టాడట! దాంతో రోజూ ప్రతి ఆటకు ఇరవై టిక్కెట్లు చింపలేకపోయారు. మొదటి 50 రోజులలో 30 షోల వరకు డ్రాప్ అయ్యాయి. 50 రోజుల తర్వాత ఇప్పటికీ 40 రోజులలో పాతికషోలు కూడా ప్రదర్శించలేకపోయారు. అలా సదరు చిత్రం ఆడకున్నా, వందరోజుల వైపు దూసుకుపోతూ ఉండడం మరో విశేషం! ఇక ఇదే చిత్రం కృష్ణాజిల్లా అవనిగడ్డలో కూడా అదే తీరున ప్రదర్శితమవుతూ ఉంది. ఇక్కడ వారానికి ఒక ఆట (అదీ ఆదివారాల్లో) ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఆటల ప్రదర్శన వివరాలన్నీ కూడా డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ వద్ద కంప్యూటర్లో రికార్డు అయి ఉంటాయి. అభిమానులకు ఈ హండ్రెడ్ డేస్ పిచ్చేమిటో కానీ చేతి చమురు వదలించుకుంటున్నారు. తమ సినిమా ఆడాలని ఎదురు డబ్బులు ఇచ్చిందే/ఇప్పించిందే కాకుండా, ఇలా ఆడకపోయినా ఆడుతున్నట్టు సంబరాలు చేసుకోవడానికీ నిశ్చయించుకున్నారు.

Read Also:Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్.. అసలు కారణం ఇదే..?

ఇవన్నీ చూస్తోంటే అప్పట్లో బాపు-రమణ తాము తీసిన ఓ సినిమా ఫ్లాప్ అయితే, సరిగా వందరోజులకు “నేడే నూరు రోజులు” అని ప్రకటన ఇచ్చి, “విడుదలై” అని బ్రాకెట్ లో వేసి సందడి చేశారు. అందులోనైనా నిజాయితీ ఉంది. కానీ, ఆడకుండా సాగే శతదినోత్సవాల్లోని నిజాయితీ ఎంత? అలా చేస్తే ఒరిగే ఆనందమేపాటిది??

Exit mobile version