Site icon NTV Telugu

కౌంట్‌ షురూ.. హుజురాబాద్‌ లో గెలుపెవరిది !

హుజూరాబాద్‌ బైపోల్‌కు సమయం దగ్గరపడింది. ప్రచారం కూడా మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో మూడు పార్టీలూ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఓటర్ల నాడి ఏంటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఎవరికి వారు జనం మధ్యకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశాలు, రోడ్‌షోలతో హడావిడి చేస్తున్నారు. ఈనెల 28తో ప్రచారం ముగియనుండగా… 30న పోలింగ్‌ జరుగుతుంది. 2 కౌంటింగ్‌ జరగనుంది. మరోవైపు ఓటర్ల మద్దతు ఎవరికి అన్నది ఆసక్తిగా మారింది.

ఓటర్ల నాటి పట్టడం ఈ ఉప ఎన్నికల్లో అంత సులువు కాదన్న చర్చ సాగుతోంది. ప్రచారం చివరి అంకానికి చేరడంతో పార్టీలు దానిపై దృష్టి పెట్టాయి. లీడర్లు మొత్తం ఓటర్ల చుట్టూనే తిరుగుతున్నారు. దాదాపు ఐదు నెలల నుంచి ప్రచార హోరు సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఇక్కడ ప్రచారం ప్రారంభమైపోయింది. పల్లెల్లో సైతం ముఖ్యనేతల పర్యటనలు సాగాయి. ఇక హామీలు ఇతరత్రా అంశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. మునుపెన్నడూ లేని విధంగా హుజూరాబాద్‌ వేదికగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అలాగే ప్రధాన పార్టీల్లో చేరికలు కూడా సాగాయి. మొత్తానికి బైపోల్‌లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Exit mobile version