Fake PMO Officer: ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) అధికారినంటూ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ.. స్టార్ హోటళ్లలో బస చేస్తూ సకలభోగాలను అనుభవించాడు. ఇదిలా ఉంటే సరిహద్దులోని సున్నిత ప్రాంతాలను పర్యటించాడు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సిబ్బందితో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అయితే చివరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డాడు.
మొత్తం అధికార యంత్రాంగాన్ని చీట్ చేసిన వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. పీఎంఓలో అడిషనల్ డైరెక్టర్ అని తనను తాను జమ్మూ కాశ్మీర్ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అక్కడి బీజేపీ కార్యకర్తలను, నాయకులను కలిశాడు. దూద్ పత్రి, గుల్ మార్గ్, దాల్ సరస్సుతో సహా పలు ప్రదేశాల్లో అత్యున్నత భద్రతా సిబ్బంది మధ్య వీఐపీ ట్రీట్మెంట్ ను పొందాడు. దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుండే వాడు.
Read Also: Delhi Liquor Case: మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు..
అయితే రెండు వారాల వ్యవధిలో మరోసారి జమ్మూ కాశ్మీర్ కు కిరణ్ భాయ్ పటేల్ వెల్లడంతో అనుమానించిన అధికారులు, ఆరా తీయగా గుట్టురట్టైంది. అతడి గత చరిత్ర గురించి ఆరా తీయగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి రావడంతో అధికారులు అవాక్కయ్యారు. మార్చి 2న నకిలీ పీఎంఓ అధికారిగా నటిస్తున్న వ్యక్తి గురించి జమ్మూ కాశ్మీర్ సీఐడీ విభాగానికి సమాచారం రావడంతో అప్రమత్తం అయ్యారు. కిరణ్ భాయ్ బస చేస్తున్న లలిత్ హోటల్ కు ఓ టీంను పంపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు శ్రీనగర్ లోని నిషాత్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు. విచారణ నిజాన్ని ఒప్పుకున్నాడు కిరణ్ భాయ్. అతడి దగ్గర నుంచి 10 నకిలీ విజిటింగ్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన భార్యతో కలిసి అహ్మదాబాద్ ఘెడసర్ లో నివసిస్తున్నాడు. ఇతడిపై అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ విచారిస్తున్నాయి. గుజరాత్ లో ఇతడిపై పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయి.