YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • సుప్రీంకోర్టులో వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ..
  • జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు..
  • ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం..
  • ఇలా అయితే మూడునాలుగేళ్లు పడుతుంది.. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది..
Ys Viveka Case

Ys Viveka Case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్‌ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, కోర్టుకు సీబీఐ తరపున న్యాయవాది వివరించారు. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది.

Read Also: Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం. అలా చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని, అలాగే ఎవరిని విచారించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగంగా పూర్తిచేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.

ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో, సుప్రీంకోర్టు విచారణను కొంతసేపు పాసోవర్ చేసింది. అనంతరం తిరిగి కేసును విచారించింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత కలిగిన ఈ కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా, మినీ ట్రయల్‌కు అవకాశం లేదని, దర్యాప్తు అంతులేని ప్రక్రియగా మారకూడదని చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియకు దిశానిర్దేశం చేయనున్నాయి.