NTV Telugu Site icon

Bengaluru: బెంగళూర్ వర్షంలో ఐదుగురిని కాపాడిన “మహిళ చీర”

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్ లో అధికారం వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరం మొత్తం భారీ వర్షం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాసుల కిందికి నీళ్లు చేరాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ వర్షం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెంది టెకీ భానురేఖ మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖతో పాటు మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు బెంగళూర్ వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా.. భానురేఖ మాత్రం మరణించారు. ఈ ఘటనపై సీఎం సిద్దరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Read Also: Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..

ఆదివారం కేఆర్ జంక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. అండర్ పాస్ లోకి ఒకేసారి వరదనీరు పోటెత్తడంతో కారు అందులో చిక్కుకుపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు వచ్చి కాపాడే వరకు వారందరి ప్రాణాలు కాపాడింది ఓ మహిళ చీర. కారులో ఉన్నవారిని స్థానికులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో అటువైపు వెళ్లిన 42 ఏళ్ల మహిళ వారి ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో వారిని కాపాడేందుకు ఓ తాడు అవసరమైంది. అయితే సమీపంలో ఎలాంటి తాడు అందుబాటులో లేదు. వారిని కాపాడేందుకు అప్పటికే నీటిలోకి ఓ యువకుడు దిగాడు. ఆ సమయంలో తన చీరను విప్పి సదరు మహిళ ఆ యువకుడికి ఇచ్చింది. అండర్ పాస్ ఇనుప ఊచలకు కట్టిన ఆ చీరను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరుగా బయటకు రాగలిగారు. మహిళ చూపిన తెగువను అందరూ ప్రశంసిస్తున్నారు. అక్కడే ఉన్న మరో మహిళ తన వద్ద ఉన్న దుప్పట్టాను, ఓ వ్యక్తి తన చొక్కాను విప్పి మహిళకు ఇచ్చారు.