NTV Telugu Site icon

Noida: ఐఏఎస్ అవతారమెత్తిన యువతి.. పూజాఖేద్కర్‌లా బిల్డప్.. చివరికిలా..!

Noida

Noida

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)లో విఫలం కావడంతో ఒక యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. స్పూఫ్ కాల్స్ ద్వారా అధికారులను బెదిరించి లగ్జరీ అనుభవించాలని ఎత్తుగడ వేసింది. కానీ పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

జోయా ఖాన్ అనే యువతి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయింది. దీంతో ఆమె నకిలీ ఐఏఎస్ అవతారమెత్తి.. దర్జాగా తిరిగాలని ప్రణాళిక వేసింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన సర్వర్‌ను ఉపయోగించి స్పూఫ్ కాల్ ద్వారా పోలీసు అధికారులను బెదిరించి ఆయా పనులు చక్కబెట్టేస్తోంది. ఇలా నోయిడా, గురుగ్రామ్, మీరట్‌లో పోలీస్ ఎస్కార్ట్‌ను డిమాండ్ చేసింది. మగ గొంతుతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారిలా బిల్డప్ ఇచ్చి బెదిరింపులకు దిగింది. అచ్చం.. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌లా గొంతెమ్మ కోర్కెలు కోరింది. జోయా ఖాన్.. పోలీసు అధికారులనే కాదు.. సామాన్య ప్రజలను కూడా ఇలానే బెదిరించినట్లు తేలింది.

కొన్ని రోజుల క్రితం నోయిడాలోని సెక్టార్ 142 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి జోయా ఖాన్ ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. సీనియర్ పోలీసు అధికారిగా నటించి తనకు అనుకూలంగా కేసును వాదించాలని ఆమె ఎస్‌హెచ్‌వోపై ఒత్తిడి తెచ్చింది. మరో సందర్భంలో అభిషేక్ జైన్ అనే వ్యక్తికి అవినీతి నిరోధక బ్యూరో నంబర్ నుంచి కాల్ చేసి బెదిరించింది. ఈ కేసులో వాదిస్తే తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తానని జోయా ఖాన్ బెదిరించింది. మొత్తానికి పోలీస్ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. జోయా ఖాన్ భండారం బయటపడింది. దీంతో జోయా ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీస్ రిమాండ్‌లో జోయా ఖాన్‌ను విచారించగా ఆమె యవ్వారం బయటపడింది. స్పూఫ్ కాలింగ్ కోసం దుబాయ్‌లోని సర్వర్‌ను ఉపయోగించినట్లు తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శక్తి మోహన్ అవస్థి తెలిపారు. చాలా టెక్నిక్‌గా ఈ కాలింగ్ ఉపయోగించినట్లుగా వెల్లడించారు. అనేక సందర్భాల్లో మగ గొంతులో మాట్లాడేదని పేర్కొన్నారు. నోయిడా, గురుగ్రామ్, మీరట్‌ల్లో నకిలీ ఐఎఎస్, ఐపీఎస్‌గా నటిస్తూ పోలీసు ఎస్కార్ట్‌ను డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమెపై మూడు చోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. జోయా ఖాన్ గతంలో యూపీఎస్సీ పరీక్షకు హాజరైందని.. ఎంపిక కాకపోవడంతో నకిలీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారిలా నటిస్తూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టిందని తెలిపారు. సీనియర్ ప్రభుత్వ అధికారులుగా నటించేందుకు ఆమె అనేక వ్యూహాలను అనుసరించిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరు కూడా రావడంతో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. జోయా ఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసును ఛేదించేందుకు మరింత సమాచారం సేకరించేందుకు వీలుగా ఆమెను విచారిస్తున్నారు.

Show comments