NTV Telugu Site icon

Harassment: విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి.. స్పందించిన నవీన్ జిందాల్..

Harassment

Harassment

Harassment: కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తున్న విమానంలో ఓ మహిళని జిందాల్ గ్రూప్ ఉద్యోగి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని సదరు బాధిత మహిళ ఎక్స్ వేదికగా వెల్లడించింది. జిందాల్ గ్రూప్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక మహిళకు పోర్న్ క్లిప్‌లు చూపించి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 65 ఏళ్ల జిందాల్ టాప్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కుమార్ సరోగి తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును సదరు మహిళ చెప్పుకొచ్చింది.

ముందుగా తనను తాను జిందాల్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని, తాను బోస్టన్ వెళ్లేందుకు అబుదాబిలో ట్రాన్సిట్ ఫ్లైట్ తీసుకుంటానని తాను అతడికి చెప్పానని మహిళ వెల్లడించింది. తాను జిందాల్ గ్రూప్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నానని చెప్పుకున్న సరోగి, తనది రాజస్థాన్ చరు జిల్లా అని, వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరు అమెరికాలో సెటిల్ అయినట్లు మహిళకు చెప్పాడు.

Read Also: Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు

ఇద్దరి మధ్య సంభాషణలు ముందుగా బాగానే సాగాయి. అయితే, తన ఫోన్‌లో కొన్ని క్లిప్స్ ఉన్నాయని చెప్పిన సరయోగి, పోర్న్ వీడియోలు చూపించేందుకు ప్రయత్నించాడని, అతను తనను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాను భయంతో వాష్‌రూం వైపు పరిగెత్తానని, తర్వాత ఎయిర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు మహిళ తన భయంకరమైన క్షణాలను వెల్లడించారు. వెంటనే స్పందించిన సిబ్బంది తనకు వేరే సీటు కేటాయించారని చెప్పారు. తాను వేరే సీటుకి మారిన తర్వాత కూడా, ఆ మహిళ ఎక్కడికి వెళ్లిందని విమాన సిబ్బందిని పదేపదే అడుగుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను ఆమె ఎక్స్‌లో జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్‌ని ట్యాగ్ చేసింది.

మహిళ ఫిర్యాదుపై బీజేపీ ఎంపీ, సంస్థ అధినేత నవీన్ జిందాల్ స్పందించారు. తమ సంస్థ ఇలాంటి విషయాలను సహించేదే లేదని చెబుతూనే, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘ మీరు ఈ విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.. మీరు చేసిన పనిని చేయడానికి చాలా ధైర్యం కావాలి మరియు అలాంటి విషయాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయాన్ని వెంటనే విచారించాలని నేను బృందాన్ని కోరాను. కఠినమైన మరియు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి’’ అని ఆయన చెప్పారు. మిస్టర్ జిందాల్‌కు కృతజ్ఞతలు తెలుపిన ఆ మహిళ, తాను చర్య కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.