Love Story: ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఇతర దేశాల నుంచి ఇండియాకు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే యువతి, యూపీలోని కుర్రాడి కోసం ఏకంగా సొంతదేశాన్ని వదిలి పిల్లలతో సహా ఇక్కడికి వచ్చింది. పబ్జీలో పరిచయమైన ఇద్దరు, క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇలాగే ఇండియాకు చెందిన ఓ వివాహిత, పాకిస్తాన్ అబ్బాయితో ప్రేమలో పడి అక్కడికి వెళ్లింది.
ఇలా భారత్ చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల నుంచి ఇలా ప్రేమ కారణంగా ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన ఓ యువతి తన ప్రేమికుడిని పెళ్లాడేందుకు అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చింది. ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్ లోకి అక్రమంగా ప్రవేశించినందుకు సదరు మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Read Also: Maldives: భారత సైనికులు మాల్దీవులు వదిలివెళ్లాలి.. కాబోయే ప్రెసిడెంట్ వ్యాఖ్యలు..
వివరాల్లోకి వెళితే ధర్మనగర్ సబ్ డివిజన్ పరిధిలోని ఫుల్‌బరీ నివాసి అయిన నూర్ జలాల్(34) స్వయంగా ఆయుర్వేద విద్యను అభ్యసిస్తుండే వాడు. తరుచుగా ఇతను బంగ్లాదేశ్ లోని మౌల్వీ బజార్ కు వెళ్తుండే వాడు. ఇలా వెళ్లిన క్రమంలో నూర్ జలాల్, 24 ఏళ్ల వివాహిత యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఫాతేమా నుస్రల్ అనే మహిళ, నూర్ తో ప్రేమలో పడింది. ఆమెకు అప్పటికే పెళ్లై, ఓ పిల్లాడు ఉన్నాడు. 15 రోజుల క్రితం నూర్ ను పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా ధర్మనగర్ చేరుకుందని పోలీసులు వెల్లడించారు.
నూర్, ఫాతేమా ఇద్దరు ఫుల్బరీలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కి చెందిన యువతి అక్రమంగా నివసిస్తుందనే సమాచారం రావడంతో గురువారం ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సదరు యువతిని 14 రోజలు పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. నూర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.