Mumbai Viral Video: దేశంలో నైరుతి రుతుపవనాలతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలోనూ కొందరు సరదా కోసం బీచ్‌లకు వెళుతున్నారు. అలా సరదాగా బీచ్‌కు వెళ్లిన జంటలో భార్య సముద్ర అలలకు బలి అయింది. తమ కళ్ల ముందే తల్లి సముద్రపు అలలకు కొట్టుకుపోవడాన్ని చూసిన చిన్నారులు తట్టుకోలేక మమ్మీ.. మమ్మీ అంటూ ఏడుస్తున్న ఘటన చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది.
Read also: Governor Tamilisai: బోనాల కోసం నాకు ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ రాలేదు..
ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు. అక్కడ అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్‌లోకి అధికారులు ఎవరినీ అనుమతించలేదు. దీంతో వారు బాంద్రా ఫోర్టుకు చేరుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరూ సరదాగా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాళ్లపై కూర్చుని అలలను చూస్తున్నారు. ఇంతలో రాకాసి అలలు వచ్చి దంపతులను సముద్రంలోకి లాగేసుకున్నాయి. ఈ క్రమంలో భార్యను కాపాడేందుకు ఆమె చీర పట్టుకుని లాగాడు ముకేశ్. కానీ ఆమె అలల ధాటికి కొట్టుకుపోయింది. ముకేశ్‌ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపులు చేపట్టగా, ఆమె మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. తల్లి జ్యోతి అలల ధాటికి కొట్టుకుపోతున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అంటూ అరిచారు. తమ కళ్ల ముందే తల్లి సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసి ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. జ్యోతి అలలకు కొట్టుకుపోవడంతో ముకేశ్, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.