దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన మజ్ను కా తిల్లా ప్రాంతంలో వివాహిత మహిళా, ఆమె స్నేహితురాలి కుమార్తెను 24 ఏళ్ల వ్యక్తి సర్జికల్ బ్లేడ్‌తో పీకకోసి చంపేశాడు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన నిఖిల్‌గా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Shraddha : విమానంలో శ్రద్ధా-రాహుల్ సీక్రెట్ వీడియో.. రవీనా టాండన్ ఫైర్!
వివరాల్లోకి వెళ్తే… 2023లో హల్ద్వానీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిఖిల్, సోనాల్ కలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అదే ఏడాది చివరిలో సోనల్ గర్భవతి అయింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా గర్భస్రావం చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ 2024లో బిడ్డ జన్మించింది. అనంతరం ఆ బిడ్డను అల్మోరాలోని ఒక గుర్తుతెలియని వ్యక్తికి రూ.2లక్షలకు అమ్మేశారు. ఆ డబ్బుతో ఢిల్లీకి మకాం మార్చేశారు. మొదట వజీరాబాద్‌లో.. అనంతరం మజ్ను కా తిల్లాకు వచ్చేశారు. ఈ క్రమంలో సోనాల్ స్థానికంగా ఉండే లక్ష్మీతో పరిచయం ఏర్పడింది. తరచుగా లక్ష్మీ ఇంటికే వెళ్తుండేది. దీంతో సోనాల్‌కు నిఖిల్ మధ్య గొడవలు మొదలయ్యాయి. మరింత ముదరడంతో సోనాల్.. లక్ష్మీ ఇంటికి మకాం మార్చేసింది.
ఇది కూడా చదవండి: Iran Warns Trump: ట్రంప్ సన్‌బాత్‌కి వెళ్లినప్పుడు డ్రోన్‌తో దాడి చేస్తాం..
సోనాల్.. లక్ష్మీ భర్త దుర్గేష్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని నిఖిల్‌కు అనుమానం పెరిగింది. ఈ విషయంలో నిఖిల్.. సోనాల్ మధ్య వాట్సాప్ చాటింగ్‌లో చాలా గొడవలు జరిగాయి. ఈ గొడవులు జరుగుతుండగానే సోనాల్ మళ్లీ గర్భవతి అయింది. అయితే ఈసారి బిడ్డను ఉంచుకోవాలని నిఖిల్ భావించాడు. సోనాల్‌తోనే ఉండాలని భావించాడు. కానీ నిఖిల్‌కు తెలియకుండానే సోనాల్ గర్భస్రావం చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దుర్గేష్ ఆదేశంతోనే సోనాల్ గర్భస్రావం చేయించుకున్నట్లు నిఖిల్ పగ పెంచుకున్నాడు. ఏదొకటి చేయాలన్న పగతో లక్ష్మీ కుటుంబంతో నిఖిల్ స్నేహం పెంచుకున్నాడు. 20-25 రోజులు లక్ష్మీ కుటుంబం దగ్గరకు వెళ్తూ వస్తున్నాడు. వారితో పరిచయం పెంచుకున్నట్లు నటించాడు.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లక్ష్మీ, దుర్గేష్.. ఐదేళ్ల పెద్ద కుమార్తెను పాఠశాల నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ఇక ఇంట్లో సోనాల్, లక్ష్మీ, దుర్గేష్‌ల ఆరు నెలల కుమార్తె మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించి సోనాల్‌ను, ఆరు నెలల శిశువును నిఖిల్ సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోసి చంపేశాడు. తనకు పుట్టబోయే బిడ్డను గర్భస్రావం చేయించాడన్న కోపంతో దుర్గేష్ బిడ్డను అత్యంత దారుణంగా చంపేశాడు.
ఇక మహిళ, శిశువు ఏడుపులు ఎవరికీ వినబడకుండా వాళ్ల నోటికి టేపులు చుట్టేశాడు. ముందు సోనాల్‌తో చాలా గొడవ జరిగింది. ఈ క్రమంలో బ్లేడ్‌తో గొంతు కోసి చంపేశాడు. అనంతరం బిడ్డను చంపేశాడు. అనంతరం మొబైల్‌ను అక్కడే ఉంచి పారిపోయాడు. లక్ష్మీ, దుర్గేష్ పాఠశాల నుంచి ఇంటికి రాగానే సోనాల్, బిడ్డ రక్తపు మడుగులో ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడు నిఖిల్‌ను అరెస్ట్ చేశారు. దుర్గేష్‌తో సోనాల్‌కు వివాహేతర సంబంధం ఉందన్న పగతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని.. కానీ సాధ్యం కాకపోవడంతో బరేలీకి వెళ్లి అక్కడ నుంచి హల్ద్వానీ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
