Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య 2018-2022 మధ్య పెరిగినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో 13,874కి చిరుతల సంఖ్య చేరుకుంది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక చిరుతపులుల ఉన్నట్లు పేర్కొంది. ఈ రాష్ట్రంలో 3907 చిరుతలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1985), కర్ణాటక(1879), తమిళనాడు(1070) ఉన్నాయి.
Read Also: Bulletproof Coffee: బుల్లెట్‌ప్రూఫ్ కాఫీతో బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు.. తెలుసుకోండి!
ఇండియాలో చిరుతపులుల జనాభా 13,874( పరిధి 12,616-15,132) ఉండొచ్చని అంచనా వేశారు. ఇది 2018లో 12,852 కంటే అధికమని నివేదిక పేర్కొంది. టైగర్ రిజర్వుల పరంగా చూస్తే.. నాగార్జున సాగర్-శ్రీశైలం(ఏపీ), పన్నా(మధ్యప్రదేశ్), సాత్పురా(మధ్యప్రదేశ్) ప్రాంతాల్లో చిరుతల జనాభా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా మధ్య భారతంలో చిరుతపులుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు నివేదిక చూపించింది. శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో వీటి జనాభా క్షీణించినట్లు తెలిపింది. మధ్యభారతం, తూర్పు కనుమల్లో అత్యధిక వృద్ధి ఉంది. శివాలిక్ కొండలు మరియు గంగా మైదానాలలో చిరుతపులి జనాభా పెరుగుదలలో సంవత్సరానికి 3.4 శాతం క్షీణత ఉంది.
