Site icon NTV Telugu

కశ్మీర్‌కు తాలిబన్లు…?

కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్‌ రికార్డ్‌ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్‌ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్‌ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్‌ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా మింగడానికి వెనకాడరు తాలిబాన్లు. పాపం పిచ్చి పాకిస్తాన్‌కి ఆ విషయం అర్థం కావట్లేదు. ఈ విషయం పక్కన పెడదాం.

కశ్మీర్‌పై తాలిబాన్లను పాక్‌ ప్రయోగిస్తుందన్నది లేటెస్ట్‌ టాక్‌. కశ్మీర్‌ లోయలో ఇటీవల తలెత్తిన పరిణామాలు.. ప్రజలలో నెలకొని వున్న ఆగ్రహావేశాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని పాకిస్తాన్‌ బావిస్తోంది. తాలిబన్లపై తనకున్న పట్టు నుంచి పాక్‌ లబ్ధిపొందాలని ఆశిస్తోంది. అమెరికా లేని ఆఫ్గనిస్తాన్‌లో పాక్‌ పాలకులు ఆడింది ఆట పాడిందే పాటగా మారుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

కశ్మీరీ ప్రజలు ఇప్పుడు తమను ఎవరో బందించి వేశారన్న భావనలో ఉన్నారు. భారత ప్రభుత్వం తమను తీవ్ర అణచివేతకు గురిచేస్తోందన్న కోపంతో ఉన్నాడు సగటు కశ్మీరీ. అందుకే కాబూల్‌ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారన్న వార్త టీవీల్లో వస్తున్నప్పుడు కాశ్మీరీల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తమపై అణచివేత పెరిగిందని..దీని నుంచి కాపాడేందుకు తాలిబన్‌ యోధులు వస్తారని కశ్మీరీలు ఆశిస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రోజులు గడుస్తున్నాయి ..కానీ భారత ప్రభుత్వం కశ్మీరీలలో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్ప లేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరాయీకరణను కశ్మీరీలు అనేక రకాలుగా వ్యక్తం చేస్తున్నారు.తాలిబాన్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవటమే అందుకు నిదర్శనం. పొరుగు దేశాలతో భారత్‌కు ప్రతికూల అనుభవాలు ఎదురైన ప్రతిసారి కశ్మీర్‌ లోయ ప్రజలు సంతోషాన్ని వ్యక్తంచేస్తారు..తామే గెలిచిన అనుభూతి పొందుతారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తరువాత అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. కేంద్రం తీసుకున్న పాలనాపరమైన చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ మార్పులు కశ్మీరీలలో ఆగ్రహం పెల్లుబికేలా చేశాయి. ప్రజాస్వామ్య ప్రక్రియపై ఆశలను కోల్పోయి .. మిలిటెన్సీ వైపు మరింత మొగ్గు చూపుతున్నారని సిటిజన్స్‌ రిపోర్ట్‌ అంటోంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అంతర్జాతీయ జిహాదీలు కశ్మీర్‌లోకి ఎంటరవుతారా ? పునరావాసం పొందే అవకాశం వుందా. అంటే ..ఉందనే అంటోంది యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీలోని రీసెర్చ్ సెంటర్ మోడరన్ వార్ ఇనిస్టిట్యూట్ (MWI) లో సహోద్యోగి అయిన యెలీనా బిబెర్మాన్. అయితే ఈ అంచానలు సత్యదూరమని హోం మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తోంది. ఆఫ్గన్‌ పరిణామాల పట్ల కాశ్మీర్‌తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కొంత ఆనందం వ్యక్తమైంది. కానీ దాని వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని హోమంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. కశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదుల్లో ఎవరూ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌ వారు కాదు. ఎక్కువగా పాకిస్తాన్, పీఓకే నుంచి వచ్చిన వారేనని వారు గుర్తు చేస్తున్నారు.

ఇకపై కశ్మీర్‌పై పాక్‌ పావులు కదపటం తీవ్రం చేస్తుందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాలిబన్లు సహాయం తీసుకుంటామని పాకిస్తాన్‌ ప్రకటించటం పరిస్థితికి అద్దంపడుతోంది. భవిష్యత్‌లో ఏం జరగనుందో ఊహించవచ్చు. పాక్‌ అధికార పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ ఓ టీవీ డిబేట్‌ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పడవి దుమారం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఇరుకున పెట్టే అవకాశం వుంది. తాలిబన్లతో పాకిస్తాన్ కుమ్మక్కైందనేది నిజమని దాంతో తేలిపోయింది.

కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారంటూ నీలం ఇర్షాద్ పాకిస్తాన్‌లోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ చర్చ సందర్భంగా అన్నారు. దీంతో టీవీ షో యాంకర్‌ అప్రమత్తమై.. ‘‘మేడం.. బాగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేశారా? భారత్‌ సహా ప్రపంచమంతటా ఈ షోను చూస్తారు’’ అని గుర్తు చేసింది. ఐనా ఇర్షద్‌ మాట మార్చలేదు. తాలిబన్లు తమకు సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కశ్మీర్‌ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్లు గతంలో ప్రకటించిన సంగతి గమనార్హం. నీలం ఇర్షాద్‌ వ్యాఖ్యలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి ముందు ముందు ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో!!

Exit mobile version