NTV Telugu Site icon

Waqf bill: ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.. వక్ఫ్ బిల్లుని ఆపేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్..

Waqf Amendment Bill

Waqf Amendment Bill

Waqf bill: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకువచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో మరోసారి సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాగైనా వక్ఫ్ అమలుని నిలిపేస్తామని, దాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు’’ అని అన్నారు. కాన్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనేక వక్ఫ్ ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు.

Read Also: Minister Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ

‘‘ఇది మాకు జీవన్మరణ సమస్య, మేము దానిని (వక్ఫ్ బిల్లు) ఎంతకైనా ఆపాలి, అవసరమైతే, దేశంలోని ముస్లింలు ప్రభుత్వానికి చోటు లేని విధంగా జైళ్లను నింపుతారు. ’’ అని హెచ్చరించారు. అవసరమైతే మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనుకాడబోమని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రం జూలై 28న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల అభ్యంతరంతో జేపీసీ ఏర్పాటైంది. ఏదైనా ఆస్తిని ‘‘వక్ఫ్ ఆస్తి’’గా పేర్కొనే వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో, రాష్ట్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిం మహిళలు, ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది.

ముస్లిమేతరులను చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సైఫుల్లా, ముస్లింల నుంచి వక్ఫ్ భూములు లాక్కోవడమే ప్రభుత్వం లక్ష్యమని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో ముస్లిమేతరులు చూసుకుంటే, వారు మసీదులు, శ్మశాన వాటికలపై సానుభూతి చూపుతారా..? ఫలితంగా మీ నుంచి మీ భూమి లాక్కోబడుతుందని, ఇది ప్రమాదకరమైన చట్టమని అన్నారు. ‘‘తమిళనాడులోనే 4,78,000 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 4,68,000 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 10 లక్షల ఎకరాల దేవాలయాల భూమి ఉంది. ముస్లింలకు ఆరు లక్షల ఎకరాలు ఉంటే సమస్యేంటి..?’’ అని సైఫుల్లా అన్నారు. వక్ఫ్ బోర్డుకు, ప్రభుత్వానికి మధ్య వివాదం వస్తే కలెక్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాడా..? అని ప్రశ్నించాడు.