NTV Telugu Site icon

Amit Shah: ఎన్నికల ముందే సీఏఏ అమలు.. అమిత్ షా సంచలన ప్రకటన..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని ఆయన చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్(యూపీపీ)పై దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇతరులు సంతకం చేసిన రాజ్యాంగంలోని ముఖ్యమైన ఎజెండా అని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలతో దానిని విస్మరించాయని, ఉత్తరాఖండ్ యూసీసీ అమలు సామాజిక మార్పుగా అమిత్ షా అభివర్ణించారు. లౌకికదేశంలో మతం ఆధారిత సివిల్ కోడ్ ఉండకూడదని అన్నారు.

Read Also: Telangana Budget: త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన శనివారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తాము మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని గ్రహించాయని చెప్పారు. మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాం కాబట్టి ప్రజలు మాకు మెజారిటీ ఇస్తారని ఆయన అన్నారు. 1947 దేశ విభజనకు నెహ్రూ-గాంధీ కుటుంబమే కారణమని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన సమయంలో దేశాన్ని ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందనే విషయాన్ని తెలిపేందుకే పార్లమెంట్‌లో శ్వేతపత్రాని సమర్పించామని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలు 500 ఏళ్లుగా అడుగుతున్నారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల రామ మందిర నిర్మాణానికి అనుమతి లభించలేదని అన్నారు.