High Court: భర్త కాకుండా, వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని జస్టిస్ అహ్లువాలియా తీర్పు చెప్పారు. కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ, ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని భర్త వాదించాడు. అయితే, భావోద్వేగ ప్రమేయం రంకు కిందకు రాదని కోర్టు అతడి పిటిషన్‌ని కొట్టివేసింది. ‘‘అక్రమ సంబంధం తప్పనిసరి అంటే లైంగిక కలయిక. భార్యకు శారీరక సంబంధాలు లేకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పటికీ, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కాదు’’ అని జనవరి 17 నాటి ఉత్తర్వుల్లో హైకోర్టు చెప్పిందని బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 144(5), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125(4) లను ప్రస్తావిస్తూ.. భార్యకు అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని స్పష్టంగా ఉంది, అయితే శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు సంబంధం ఉందనే ఆరోపణలను నిలబడవని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: Bhatti Vikramarka: అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము..
నెలకు రూ. 8,000 జీతం పొందుతున్న వార్డు బాయ్‌గా పనిచేస్తున్నానని చెప్పుకున్న భర్త, తన భార్య ఇప్పటికే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం రూ. 4,000 అందుకుంటోందని, CrPC సెక్షన్ 125 కింద అదనంగా రూ. 4,000 ఇవ్వడం సమంజసం కాదని వాదించాడు. అయితే, కోర్టు ఈ వాదనల్లో ఎలాంటి అర్హత లేదని భావించింది, కుటుంబ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆర్థిక ఇబ్బందుల్ని ప్రస్తావిస్తూ భర్త సమర్పించిన జీతం సర్టిఫికేట్‌ని పరిశీలించిన కోర్టు, దానిపై ఆస్పత్రి స్థలం, జారీ చేసిన తేదీ వంటి కీలక విషయాలు లేవని పేర్కొంది.
అంతే కాకుండా, తన భార్య బ్యూటీ పార్లర్ ద్వారా ఆదాయం సంపాదిస్తోందనే భర్త వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె అలాంటి వ్యాపారం కోసం షాప్‌ని కలిగి ఉండటం లేదా అద్దెకు తీసుకుందనే నిరూపించే ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు అందించడంలో అతను విఫలమయ్యాడని కోర్టు గమనించింది. కుటుంబ న్యాయస్థానం మధ్యంతర భరణం మంజూరు చేయడం ద్వారా ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడలేదని పేర్కొంటూ, భర్త పిటిషన్‌ను ధర్మాసనం చివరికి కొట్టివేసింది.