Site icon NTV Telugu

Amit Shah: పార్సీలు, క్రైస్తవులు సీఏఏకి అర్హులైనప్పుడు ముస్లింలు ఎందుకు కారు..? అమిత్ షా ఏం చెప్పారంటే..

Amit Shah

Amit Shah

Amit Shah: భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని అమలు చేస్తోంది. డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు ఇలా ముస్లిమేతరులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించనుంది. అయితే, ఈ చట్టంలో ముస్లింలను ఎందుకు మినహాయించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రహోంమంత్రి మాట్లాడుతూ.. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.

అయితే, పార్సీ, క్రైస్తవం భారత్‌లో పుట్టని మతాలకు సీఏఏ ఇచ్చినప్పుడు, ముస్లింలు ఎందుకు అర్హులు కారని ప్రశ్నించారు. అమిత్ షా దీనికి సమాధానం ఇచ్చారు. “ఆ ప్రాంతాలు ముస్లిం జనాభా కారణంగా ఈ రోజు భారతదేశంలో భాగం కాదు. ఈ భూభాగాలు వారి కోసం ఇవ్వబడ్డాయి. అఖండ భారత్‌లో భాగమై మతపరమైన హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించడం మన నైతిక, రాజ్యాంగ బాధ్యత అని నేను నమ్ముతున్నాను” అని బదులిచ్చారు. అఖండ భారత్ అనేది ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్‌ కూడిన భాగం.

Read Also: Supreme Court: టీచర్ బలవంతంగా విద్యార్థినికి ఫ్లవర్స్ ఇవ్వడం లైంగికంగా వేధించడమే..

విభజన సమయంలో పాకిస్తాన్‌లో 23 శాతం ఉన్న హిందువులు ఈ రోజు 3.7 శాతానికి పడిపోయారు, వారంతా ఎక్కడికి వెళ్లారు..? ఇక్కడకు రాలేదు. బలవంతంగా మతమార్పిడిలు జరిగాయి. వారిని అవమానించారు, ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించారు. మన పార్లమెంట్, రాజకీయ పార్టీలు వారి గురించి విచారం వ్యక్తం చేశాయా..? అని అమిత్ షా ప్రశ్నించారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో 22 శాతం ఉన్న హిందువులు ఈ రోజు 10 శాతానికి తగ్గిందని, 1992లో ఆఫ్ఘనిస్తాన్‌లో 2 లక్షల మంది సిక్కుల జనాభా ఇప్పుడు 500కి పడిపోయిందని చెప్పారు. వారి మత విశ్వాసాల ప్రకారం వారికి జీవించే హక్కు లేదా..? అని అమిత్ షా అడిగారు.

షియా, బలూచ్, అహ్మదీయ ముస్లింల వంటి పీడించబడుతున్న వర్గాల గురించి ప్రశ్నించగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ కూటమిని ముస్లింలుగానే పరిగణిస్తున్నారని, అలాగే ముస్లింలు కూడా ఇక్కడ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, జాతీయ భద్రత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అమిత్ షా చెప్పారు. సీఏఏ చట్టం మతపరంగా మూడు దేశాల్లో హింసించబడుతున్న మైనారిటీల కోసమని వెల్లడించారు.

Exit mobile version