Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నించి, అరెస్ట్ చేసింది. ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ, వేటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందని ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
ఈ కేసులో కేజ్రీవాల్‌ని ‘కుట్రదారు’గా ఈడీ భావిస్తోంది. మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవితతో కలిసి కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో సౌత్ లాబీగా పిలువబడుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఆరోపిస్తోంది. ఇందుకు బదులుగా ‘‘సౌత్ లాబీ’’ ఆప్‌కి రూ. 100 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కేజ్రీవాల్ పేరు ఉంది. ఈ విషయాన్ని ఈడీ తన రిమాండ్ నోట్, చార్జిషీట్లలో పేర్కొంది.
Read Also: Pakistan: మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పాక్.. తలనొప్పిగా మారిన తాలిబాన్
లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరుచూ కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని, ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని ఈడీ తెలిపింది. సీఎం కేజ్రీవాల్‌తో చర్చించినట్లు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సీఎం కేజ్రీవాల్‌ని కలవడానికి నాయర్‌ని పంపినట్లు తెలిసింది. సౌత్ లాబీలో నిందితుడుగా ఇప్పుడు సాక్షిగా ఉన్న రాఘవ్ మాగుంట.. తన తండ్రి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్‌ని కలిసినట్లు చెప్పారు.
ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. డిసెంబర్ 2022లో సిసోడియా నుంచి మంత్రుల బృందం నుంచి నివేదిక పొందినట్లు తెలిపారు. సిసోడియా ఫోన్ చేసి తనను సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో సత్యేందర్ జైన్ అక్కడే ఉన్నాడని, డాక్యుమెంట్ కూడా చూశానని చెప్పారు. మంత్రుల బృందం (GoM) సమావేశంలో అటువంటి ప్రతిపాదన ఏదీ చర్చించబడనందున తాను ఆశ్చర్యపోయానని, అయితే ఆ డాక్యుమెంట్ ఆధారంగా GoM నివేదికను తయారు చేయమని తనను కోరినట్లు పేర్కొన్నారు.
